బీడ్ (మహారాష్ట్ర): “నమ్మిన వాళ్లే నక్కల్లా మారి నన్ను వేటాడారు.. ఆఖరికి నా ప్రాణం తీశారు!” అంటూ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పరళీ తాలూకాకు చెందిన రామేశ్వర్ గవానే అనే రైతు రాసిన ఆఖరి పోస్ట్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. భార్య మరియు ఆమె బంధువుల వేధింపులు తాళలేక, తన పొలంలోనే పురుగుల మందు తాగి, చెట్టుకు ఉరివేసుకుని రామేశ్వర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు అతను ఫేస్బుక్లో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ చదివితే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
ఆస్తిపై కన్ను.. భర్తపై కర్కశత్వం: రామేశ్వర్ తన పోస్ట్‌లో భార్య మరియు ఆమె బంధువుల అసలు రంగును బయటపెట్టాడు. ఆస్తి కోసం తనను మానసికంగా, శారీరకగా ఎలా వేధించారో ఎడెళ్లూ పూసగుచ్చినట్లు వివరించాడు. “నా భార్య నన్ను కొట్టేది. ఆస్తి కాజేయడమే ఆమె లక్ష్యం. ఆమె బంధువులు నా ఇంట్లోని అసలు బంగారాన్ని తీసుకెళ్లి, ఆ చోట నకిలీ నగలు పెట్టారు. ఆ దొంగతనం నా మీద మోపి నన్ను ఇరికించాలని చూశారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
భోజనంలో విషం.. నిద్రలో నరకం: రామేశ్వర్ రాసిన విషయాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. “నేను నిద్రపోతున్నప్పుడు నన్ను భయపెట్టేందుకు ఏవో శబ్దాలు చేసేది. నా భోజనంలో విపరీతంగా ఉప్పు, కారం కలిపేది. ఒక్కోసారి ఏవో మందులు కూడా కలిపేది, అవి తిన్న తర్వాత నాకేం జరుగుతుందో నాకే తెలిసేది కాదు. నా తల్లికి ఎప్పుడూ పాసిపోయిన రొట్టెలే పెట్టేది. దీనివల్ల ఆమెకు కడుపునొప్పి వచ్చేది. గత రెండేళ్లుగా నన్ను బూతులు తిడుతూ, అవమానిస్తూ నరకం చూపించారు” అని రామేశ్వర్ వాపోయాడు.
టెక్నాలజీతో వేధింపులు.. నక్కల వేట! కేవలం తిట్టడమే కాకుండా, తనను ఇరికించేందుకు పక్కా ప్లాన్ వేశారని రామేశ్వర్ ఆరోపించాడు. “నా ఫోన్‌ను హ్యాక్ చేశారు. నన్ను కావాలని రెచ్చగొట్టి, నేను కోపంలో ఏమైనా అంటే వాటిని రికార్డ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేసేవారు. ఇందుకోసం నా స్నేహితులను కూడా వారు లోబర్చుకున్నారు. ఈ కుట్రలో కొందరు డాక్టర్లు, లాయర్లు కూడా ఉన్నారు” అంటూ వారి పేర్లను కూడా పోస్ట్‌లో వెల్లడించాడు.
పోలీసుల దర్యాప్తు: రామేశ్వర్ పోస్ట్ పెట్టిన వెంటనే స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే జరగకూడదని జరిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. రామేశ్వర్ రాసిన పేర్ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ ఘటన మొత్తం బీడ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే కిరాతకంగా వేధించి మరణానికి పురిగొల్పిన భార్య మరియు ఆమె బంధువుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
