“నట్టడవిలో బస్సులో గర్భిణీ ఆర్తనాదాలు..!” దుప్పట్లతో చిన్న గదిని ఏర్పాటు చేసిన డ్రైవర్.. బస్సులోనే పండంటి ఆడబిడ్డ జననం.. తల్లీబిడ్డలను కాపాడిన డ్రైవర్ మానవత్వం..!!

అసోం రాష్ట్రంలో గౌహతి నుంచి డిబ్రూగఢ్ వైపు రాత్రి పూట వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న నిండు గర్భిణీకి అకస్మాత్తుగా తీవ్రమైన పురిటినొప్పులు వచ్చాయి.

బస్సు దట్టమైన అటవీ ప్రాంతంలో వెళ్తుండటం, సమీపంలో ఎలాంటి ఆసుపత్రి సౌకర్యం లేకపోవడంతో, డ్రైవర్ వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి బస్సును నిలిపివేశాడు.

అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో, బస్సులోని మహిళల విజ్ఞప్తి మేరకు మగ ప్రయాణికులంతా కిందకు దిగారు. ఆ తర్వాత డ్రైవర్, ప్రయాణికులు తమ దుప్పట్లు, బట్టలతో బస్సులోనే తాత్కాలికంగా ఒక చిన్న గదిలా ఏర్పాటు చేశారు.

బస్సులోని మహిళల సహాయంతో ఆ గర్భిణీ బస్సులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కాస్త ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్‌లో తల్లీబిడ్డలను సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.

తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న బస్సు డ్రైవర్, ఆ చిన్నారికి రూ.5,000 బహుమతిగా ఇచ్చాడు. బస్సు డ్రైవర్, హెల్పర్ చేసిన ఈ సమయోచిత సాయాన్ని, వారి మానవత్వాన్ని ప్రయాణికులు, నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: