ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో బహిరంగ మార్కెట్లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. బైక్‌పై ఉన్న ఓ బాలుడిని మహిళ దారుణంగా కొట్టిన దృశ్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి.
బాగ్పత్ ప్రాంతంలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆశిష్ పాస్వాన్ అనే వ్యక్తి తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. నడిరోడ్డుపై ఓ మహిళ బాలుడిని ఎందుకు ఇలా కొడుతోందో తెలియడం లేదని, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
వైరల్‌గా మారిన వీడియోలో నల్లరంగు మోటార్‌సైకిల్ వద్ద ఉన్న బాలుడి దగ్గరకు ఓ మహిళ వేగంగా వెళ్లడం కనిపిస్తోంది. అనంతరం బాలుడి జుట్టును రెండు చేతులతో గట్టిగా పట్టుకుని లాగుతూ, అతడి తలపై, పైభాగంలో పలుమార్లు కొడుతున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. బాలుడు బాధతో విలవిల్లాడుతున్నప్పటికీ ఆమె దాడి కొనసాగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడున్న కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఆమె పట్టించుకోలేదని వీడియో ఆధారంగా తెలుస్తోంది.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో బాగ్పత్ జిల్లా పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై బరౌత్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు అధికారిక ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయినప్పటికీ, వీడియోలో కనిపిస్తున్న మహిళను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని, వాస్తవాలను నిర్ధారించిన తర్వాత నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తమ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
అసలు ఆ మహిళ బాలుడిపై ఎందుకు దాడి చేసింది? వారి మధ్య ఏదైనా వివాదం జరిగిందా? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాతే ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a Reply