నడిరోడ్డుపై యువకుడిని బలవంతంగా కారులోకి ఎక్కించిన ముఠా.. ‘POLICE’ అని రాసి ఉన్న స్కార్పియో!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్–ఝాన్సీ రహదారి ప్రాంతంలో పట్టపగలు ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బుధవారం జరిగిన ఈ ఘటనలో సుమారు 5 నుంచి 7 మంది వ్యక్తులు కలిసి ఓ యువకుడిని బలవంతంగా స్కార్పియో వాహనంలోకి ఎక్కించుకుని వెళ్లినట్లు సమాచారం.

ఆ స్కార్పియో వాహనం నంబర్ ప్లేట్ కింద ‘POLICE’ అని రాసి ఉండటంతో.. మొదట అక్కడున్న కొందరు వ్యక్తులు పోలీసులు అతడిని విచారణ కోసం తీసుకెళ్తున్నారని భావించినట్లు తెలుస్తోంది.

అయితే యువకుడు ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడున్న వారికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై.. సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. యువకుడిని తీసుకెళ్లిన వాహనం కోసం పలు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

తమను పోలీసులు వెంబడిస్తున్న విషయం గుర్తించినట్లు భావిస్తున్న నిందితులు.. యువకుడిని ఎక్కువ దూరం తీసుకెళ్లకుండా ఇందర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణ్‌పూర్ రోడ్డు సమీపంలో వదిలేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

యువకుడిని సురక్షితంగా రక్షించిన అనంతరం పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అలాగే ఘటన జరిగిన ప్రాంతంతో పాటు యువకుడిని తీసుకెళ్లిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.

యువకుడి వాంగ్మూలం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

ఈ కేసులో దశరథ్ యాదవ్, శైలేంద్ర యాదవ్, విశాల్ యాదవ్, సంజు యాదవ్, రాఘవేంద్ర యాదవ్, వికాస్ యాదవ్ పేర్లతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

హత్యాయత్నం, కిడ్నాప్, రాజీకి ఒత్తిడి చేయడం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ‘POLICE’ అని రాసి ఉన్న స్కార్పియోలో యువకుడిని బలవంతంగా తీసుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు యువకుడిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఈ ఘటన వెనుక ఉన్న కారణం ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *