“నదిని శుభ్రం చేయడం ఒక నేరమా?.. అందుకా 2 ఏళ్ల జైలు శిక్ష?!”.. పర్యావరణ న్యాయవాదికి వచ్చిన వింత కష్టం..!!

తూర్పు లండన్‌లోని ఒక నదీ తీరం కొన్నేళ్లుగా చెత్తాచెదారంతో, అత్యంత కాలుష్యంతో నిండిపోయింది. దీనిని గమనించిన పాల్ పౌల్స్‌ల్యాండ్ అనే 40 ఏళ్ల పర్యావరణ న్యాయవాది (ఎన్విరాన్‌మెంటల్ లాయర్), స్థానిక వాలంటీర్లను ఏకం చేసి.. 10 రోజుల పాటు కఠినంగా శ్రమించారు. ఈ క్రమంలో వారు ఆ నది నుండి 200 మూటలకు పైగా చెత్తను తొలగించి, నదికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారు.

దీని ఫలితంగా, కొన్ని దశాబ్దాల తర్వాత ఆ నదిలోకి చేపలు, తుమ్మెదలు మరియు పక్షులు మళ్లీ తిరిగి రావడం ప్రారంభించాయి. ఇందుకు సంబంధించిన అందమైన ఫోటోలను ఆయన తన ‘X’ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో పంచుకున్నారు.

సత్కార్యానికి సన్మానానికి బదులు విచారణ:
అయితే, ఈ గొప్ప మానవతా చర్యకు అభినందనలు తెలపడానికి బదులుగా.. “ప్రభుత్వం నుండి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా మీరు నదిని ఎలా శుభ్రం చేస్తారు? పూడికను ఎలా తీస్తారు?” అంటూ లండన్ పర్యావరణ బోర్డు (ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ) ఆయనపై వింత విచారణను ప్రారంభించింది. అంతేకాకుండా, ఈ కేసులో ఆయనకు గరిష్టంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే షాకింగ్ సమాచారం వెలువడింది.

ప్రభుత్వ తీరుపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం:
నదుల్లోకి బిలియన్ల లీటర్ల వ్యర్థాలను గుమ్మరిస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను వదిలేసి, నదిని స్వచ్ఛందంగా శుభ్రం చేసిన తమపై చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో.. “ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపించిన ఇలాంటి నిజమైన హీరోలను కోర్టుల చుట్టూ తిప్పడం అత్యంత సిగ్గుచేటు” అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు లండన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


Posted

in

by

Tags: