తిరువనంతపురం: ‘కేరళ స్టోరీ’ చిత్రానికి రెండవ భాగమైన ‘బియాండ్ ద కేరళ స్టోరీ’ సినిమాపై సామాజిక కార్యకర్త శ్రీజ నెయ్యట్టింకర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె తన ఫేస్బుక్లో ఒక సుదీర్ఘ పోస్ట్‌ను పంచుకున్నారు.
ద్వేషాన్ని రగిలించే ‘కేరళ స్టోరీ’ రెండవ భాగం ట్రైలర్ విడుదలైందని, ఇందులో ముస్లింలకు వ్యతిరేకంగా మతవిద్వేషాన్ని చిమ్మే దృశ్యాలు మాత్రమే ఉన్నాయని ఆమె ఆరోపించారు. కేరళ లౌకికత్వాన్ని, సామాజిక వాతావరణాన్ని సవాలు చేసే ఈ సినిమాపై కేరళ సమాజం గళమెత్తాలని ఆమె పిలుపునిచ్చారు.
శ్రీజ తన పోస్ట్‌లో పేర్కొన్న ముఖ్యాంశాలు:
- “నేను ఎన్నో ముస్లిం ఇళ్లలో నిద్రపోయాను, వారు పెట్టిన ఆహారం తిన్నాను, రాత్రింబవళ్లు వారితో కలిసి ప్రయాణించాను. నా జీవితంలో వారెప్పుడూ ‘దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక’ అనే ప్రేమపూర్వక మాటలు తప్ప, మతం మార్చుకోమని ఎప్పుడూ అడగలేదు.”
- “నన్ను ఎవరూ బలవంతంగా మతం మార్చలేదు, ఐఎస్‌లో చేర్చడానికి ప్రయత్నించలేదు, లేదా బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించలేదు. ఏ ముస్లిం కూడా నన్ను మోసం చేయడానికి ప్రయత్నించలేదు.”
- “నేను మొదటిసారి బీఫ్ తిన్నది.. బీఫ్ దగ్గర పెట్టుకున్నాడన్న కారణంతో అఖ్లాక్ అనే వ్యక్తిని చంపిన సంఘ్ పరివార్ హింసకు నిరసనగానే. అంతకుముందు వరకు నేను బీఫ్ తినేదాన్ని కాదు. ముస్లింల ఇళ్లకు వెళ్లినప్పుడు నేను బీఫ్ తిననని చెబితే వారు ఎప్పుడూ నన్ను బలవంతం చేయలేదు. పైగా నాకు ఇష్టమైన పదార్థాలను అడిగి మరీ ప్రేమతో వండి పెట్టేవారు.”
- “పర్దా ధరించిన నా ఫోటోను ఇక్కడ పెట్టడానికి రాజకీయ కారణం ఉంది. సంఘ్ పరివార్ అబద్ధాలకు లొంగనని ప్రకటించడానికి మరియు విద్వేష ప్రచారానికి గురవుతున్న ముస్లిం సమాజంతో సంఘీభావం తెలపడానికే నేను ఇలా చేశాను.”
