లక్నోలోని ఒక ప్రాంతంలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న మాలిస్కా సోన్వాని అనే విద్యార్థిని, అనుమానాస్పద స్థితిలో జరిగిన ఒక ప్రమాదంలో చిక్కుకుని ఐసీయూలో కోమాలో ప్రాణాలతో పోరాడుతోంది.
ఈ ఘటన జరిగి 22 రోజులు కావస్తున్నా తనకు న్యాయం జరగలేదని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మాలిస్కాను ప్రేమిస్తున్న ప్రియాంశు గుప్తా అనే వ్యక్తితో ఆమె ‘లివ్-ఇన్’ (సహజీవన) బంధంలో ఉంది. ఘటన జరిగిన రోజు రాత్రి 11:30 గంటల సమయంలో వీరిద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే అర్ధరాత్రి ప్రమాదం జరిగినా, తెల్లవారుజామున 4 గంటలకు మాత్రమే ప్రియాంశు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. గాయపడిన అమ్మాయిని ఆసుపత్రికి సరిగ్గా తీసుకెళ్లకుండా, ఆమె చనిపోవాలనే ఉద్దేశపూర్వకంగానే సమయాన్ని వృథా చేశాడని మాలిస్కా తండ్రి తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రమాదం తర్వాత మాలిస్కా సెల్‌ఫోన్‌ను ప్రియాంశు తన వద్దే ఉంచుకుని ఇవ్వడానికి నిరాకరించాడు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి ఫోన్ తీసుకుని చూడగా, అందులో ఒక గుండెల్ని పిండేసే వీడియో లభ్యమైంది. ఆ వీడియోలో మాలిస్కా ప్రియాంశు ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ, “నన్ను వదిలేయ్ ప్రియాంశు, నన్ను వెళ్ళనివ్వు…” అని కన్నీళ్లతో వేడుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
అంతేకాకుండా, ఆ అమ్మాయి అధికారిక పత్రాలలో (డాక్యుమెంట్లలో) మోసం చేసి, తన ఇంటి పేరును (సర్ నేమ్) చేర్చుకున్నాడని కూడా ప్రియాంశుపై ఆరోపణలు వచ్చాయి. ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా, “ఇది సాధారణ రోడ్డు ప్రమాదమే” అని చెబుతూ పోలీసులు కేసును నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సౌత్ జోన్ డీసీపీ మహమ్మద్ ముస్తాక్ మాట్లాడుతూ.. “వీరిద్దరూ లివ్-ఇన్ బంధంలో జీవిస్తున్నట్లు ధృవీకరించబడింది. ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదంలా కనిపిస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై నిష్పాక్షిక విచారణకు ఆదేశించాం” అని తెలిపారు. ఈ ఘోర ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

Leave a Reply