ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావా జిల్లాలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భర్త, బావమరిది కలిసి శీతల పానీయంలో (కూల్ డ్రింక్) విషం కలిపి ఇవ్వడంతో తన ప్రియుడు చనిపోయాడని, తాను కూడా ప్రాణాలతో పోరాడుతున్నానని ఓ మహిళ ఇచ్చిన వాంగ్మూలం కుటుంబ సంబంధాల వికృత రూపాన్ని బయటపెట్టింది.
ఇటావా జిల్లా చౌదనా గ్రామానికి చెందిన 38 ఏళ్ల మమతకు, 14 ఏళ్ల క్రితం మహావీర్ సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. మహావీర్ సింగ్ మద్యానికి బానిసై, ఎలాంటి పనీ చేయకుండా ఉండేవాడని సమాచారం. దీంతో కుటుంబాన్ని పోషించడానికి డబ్బుల్లేక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఇలాంటి పరిస్థితుల్లో మమతకు, ఆమె భర్త బంధువుల్లో తమ్ముడైన 34 ఏళ్ల గులాబ్ సింగ్తో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. మమత నలుగురు పిల్లల ఖర్చులను, కుటుంబ అవసరాలను గులాబ్ సింగే చూసుకునేవాడు.
ఈ క్రమంలో భర్త ఇంట్లోనే గులాబ్ సింగ్ కూడా మమతతో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించాడు. దీనివల్ల భర్త మహావీర్ సింగ్కు, గులాబ్ సింగ్కు మధ్య తీవ్ర వైరం ఏర్పడింది. గులాబ్ సింగ్ తల్లి కూడా తన కుమారుడే ఇన్నాళ్లూ మమతను, పిల్లలను పోషించాడని తెలిపింది.
గత ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మమత, గులాబ్ సింగ్ శీతల పానీయం తాగారు. తాగిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. మమత వాంతులు చేసుకోవడం మొదలుపెట్టగా, గులాబ్ సింగ్ పరిస్థితి మరింత క్షీణించింది. వెంటనే వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వారిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గంలోనే గులాబ్ సింగ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మమతకు మాత్రం అత్యవసర విభాగంలో ముమ్మర చికిత్స అందించారు.
ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం మమత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించింది. “నా భర్త మహావీర్ సింగ్, ఆయన సోదరుడు నరేష్ ఇంటికి వచ్చి మాకు కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన కొన్ని క్షణాల్లోనే మా పరిస్థితి విషమించింది” అని ఆమె ఆరోపించింది.
గులాబ్ సింగ్ తల్లి కూడా మహావీర్ సింగ్, నరేష్లపై తీవ్ర ఆరోపణలు చేసింది. వీరి మధ్య ఇతర తగాదాలు ఏమైనా ఉన్నాయా లేక శీతల పానీయంలోకి విషం వేరే ఎలాగైనా చేరిందా అనే కోణంలో ఉస్రాహార్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.
