మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి ప్లాట్‌ఫామ్, రైలు మధ్య పడబోయిన ఒక వృద్ధుడిని అక్కడ ఉన్న ఆర్‌పీఎఫ్ (RPF) మహిళా పోలీస్ అధికారి తన సమయస్ఫూర్తితో రక్షించిన సంచలన ఘటన వెలుగుచూసింది.
నవరాత్రి ఉత్సవాల వేళ ఒక మహిళా అధికారి ధైర్యసాహసాలను చాటిచెప్పేలా జరిగిన ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అకోలా రైల్వే స్టేషన్‌లోని 2వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన 63 ఏళ్ల దీపక్ సాలిగ్రామ్ సదాశివ్ అనే దివ్యాంగ వృద్ధుడు కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించాడు.
ఆ సమయంలో ఊహించని విధంగా అతని కాలు జారి, ప్లాట్‌ఫామ్‌కు మరియు కదులుతున్న రైలుకు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఖాళీలో పడిపోవడాన్ని చూసి అక్కడున్న ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇది గమనించిన మహిళా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సోనాల్ ఇంగ్లే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో పరిగెత్తుకెళ్లి తోటి ప్రయాణికుల సాయంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా బయటకు లాగి కాపాడారు. ఈ సాహసోపేతమైన చర్య వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పడమే కాకుండా, ఆ వృద్ధుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. విచారణలో ఆ వృద్ధుడు చంద్రపూర్ వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
ప్రమాదకర రీతిలో కదులుతున్న రైళ్లను ఎక్కడంగానీ, దిగడంగానీ చేయకూడదని రైల్వే యాజమాన్యం నిరంతరం హెచ్చరిస్తున్నప్పటికీ, ఈ మహిళా పోలీస్ అధికారి చూపిన చాకచక్యాన్ని, అంకితభావాన్ని స్థానిక ప్రజలతో పాటు నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

Leave a Reply