చైనాలో ఒక రెస్టారెంట్ యజమానురాలు తన దాతృత్వంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తీవ్రమైన చలిలోనూ స్కూటర్‌పై విధులకు హాజరవుతున్న తన ఇద్దరు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారి శ్రమను గుర్తిస్తూ ఏకంగా రెండు ఖరీదైన బీఎండబ్ల్యూ (BMW) కార్లను బహుమతిగా ఇచ్చారు.
హెనాన్ ప్రావిన్స్‌లో రెస్టారెంట్ నడుపుతున్న మా యాన్లీ అనే మహిళ.. తన వద్ద 8 ఏళ్లుగా పనిచేస్తున్న లీ జీ అనే ఉద్యోగి పడుతున్న కష్టాన్ని గత చలికాలంలో గమనించారు. అతడు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రావడం వల్ల తీవ్రమైన చలికి ముఖం ఎర్రబడి, చెవులు బిగుసుకుపోయి ఉండటం చూసి ఆమె చలించిపోయారు. తనకు ఉన్న సౌకర్యాలు తన ఉద్యోగులకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భావించారు.
ఆ ఆలోచనతోనే, సెప్టెంబర్ 24న ఒక మీటింగ్‌కు వెళ్దామని చెప్పి ఆ ఇద్దరు ఉద్యోగులను నేరుగా బీఎండబ్ల్యూ (BMW) కార్ షోరూమ్‌కి తీసుకెళ్లారు. ఒక్కొక్కటి సుమారు రూ.43 లక్షల విలువైన రెండు కార్లను కొనుగోలు చేసి, ఎటువంటి షరతులు లేకుండా నేరుగా వారి పేరు మీదే రిజిస్టర్ చేసి, తాళాలను బహుమతిగా అందజేశారు.
కలలో కూడా ఊహించని ఈ భారీ కానుకను చూసి ఆ ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా యజమానురాలు మా యాన్లీ మాట్లాడుతూ.. “నా సంస్థ సాధించిన విజయానికి కారణమైన నా ఉద్యోగుల కష్టాన్ని గౌరవించడమే నాకు నిజమైన సంతోషం” అని ఉద్వేగంగా పేర్కొన్నారు.

Leave a Reply