“నాకు చనిపోవాలనిపిస్తోంది..!” ఆ డ్రెస్ మా అమ్మే కొనిచ్చింది.. నేనేం తప్పు చేయలేదు.. యూట్యూబ్ లైవ్‌లో కన్నీటి పర్యంతమైన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్!

ఉత్తరప్రదేశ్‌లో సోషల్ మీడియా వీడియో వివాదం కారణంగా సస్పెన్షన్‌కు గురైన మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ అను కౌశిక్, యూట్యూబ్ లైవ్‌లోకి వచ్చి తన ఆవేదనను వెళ్లగక్కుతూ మౌనం వీడారు.

ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా తీసుకుని దుష్ప్రచారం చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చాడని ఆమె ఆరోపించారు.

సస్పెన్షన్ వేటు పడినప్పటి నుంచి తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు తెలిపిన ఆమె, తనకు నిరంతరం ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని, తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని కన్నీటితో చెప్పారు. ఈ వరుస పరిణామాల వల్ల తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని ఆమె షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

వైరల్ అయిన వీడియోలో తాను ధరించిన డ్రెస్ ఆగ్రాలోని ఓ మాల్‌లో తన తల్లి స్వయంగా కొనిచ్చిందని, అందులో ఎలాంటి అభ్యంతరకర విషయం లేదని వివరణ ఇచ్చారు. తన కుటుంబానికే లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వచ్చిందని, దీన్ని ఇంత పెద్ద రచ్చ ఎందుకు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

సోషల్ మీడియా ద్వారా అసభ్యకర కంటెంట్ రూపొందించి డబ్బులు సంపాదించారనే ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. అనుమానం ఉంటే తన మరియు కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చని సవాల్ విసిరిన ఆమె, తన పోస్టులన్నీ కేవలం ఫిట్‌నెస్, డైట్ సంబంధిత అంశాలేనని స్పష్టం చేశారు.

ఎలాంటి విచారణకైనా పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపిన ఎస్ఐ అను కౌశిక్, తాను ఏ తప్పూ చేయనందున ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ వివాదంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *