“నాకు నా భర్త కావాలి..!” దుబాయ్ నుంచి ఇండియాకు పరుగెత్తుకొచ్చిన మహిళ: రహస్యంగా దాచిపెట్టిన కుటుంబసభ్యులు.. 12 ఏళ్లు చిన్నవాడిని నమ్మి మోసపోయిన వైనం..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, దుబాయ్ నుంచి వచ్చిన అశ్విందర్ కౌర్ అనే మహిళ, తనకు చెప్పకుండా భారతదేశానికి పారిపోయి వచ్చిన భర్త కోసం వీధివీధినా వెతుకుతూ తిరుగుతున్న ఘటన తీవ్ర కలకలం రేపింది.

గత 23 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె, కనిపించకుండా పోయిన తన భర్త సునీల్ ఠాకూర్‌ను వెతికి పెట్టాలంటూ సత్నా మహిళా పోలీస్ స్టేషన్‌లో కన్నీటిపర్యంతమై ఫిర్యాదు చేసింది.

అశ్విందర్ కౌర్‌కు గతంలోనే వివాహం జరిగి విడాకులు కాగా, తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన సునీల్ ఠాకూర్‌తో 2020 నుంచి దుబాయ్‌లో సహజీవనం చేసింది. అనంతరం ఫిబ్రవరి 2025లో జబల్‌పూర్‌లోని ఒక గురుద్వారాలో కుటుంబసభ్యుల సమక్షంలో వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి దుబాయ్‌లోనే కాపురం పెట్టారు.

అయితే, జూలై 31 వరకు దుబాయ్‌లోనే అశ్విందర్‌తో ఉన్న సునీల్, ఆమెకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా ఇండియాకు పారిపోయి వచ్చాడు. సత్నాలో ఉంటున్న సునీల్ సోదరి, తల్లి అతడిని బలవంతంగా ఇంట్లో దాచిపెట్టి, తనతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని అశ్విందర్ ఆరోపించింది.

భర్తను వెతుక్కుంటూ దుబాయ్ నుంచి సత్నాకు చేరుకున్న అశ్విందర్.. “నేను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యను, నాకు నా భర్త కావాలి” అంటూ కన్నీళ్లతో కోర్టును, పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను కోరుకోవడం లేదని, కేవలం ఆయనతో కలిసి జీవించడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సత్నా పోలీసులు, దుబాయ్ నుంచి వచ్చిన ఆ మహిళ విజ్ఞప్తి మేరకు సునీల్ ఠాకూర్‌ను కనిపెట్టేందుకు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. తన హక్కుల కోసం, భర్త కోసం దేశం దాటి వచ్చి పోరాడుతున్న ఆ మహిళ దీనస్థితి స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది.


Posted

in

by

Tags: