నాగ పంచమి పూజ కోసం ఇంటికే వచ్చిన నాగుపాము..! భక్తిశ్రద్ధలతో పూజించిన మహిళ.. వినమ్రంగా నమస్కరిస్తుండగా చేతిపై కాటు.. బతికున్న పాముతో ఇదెక్కడి ఘోరం.? తీవ్ర దిగ్భ్రాంతి..!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్‌లో నాగ పంచమి పూజ సందర్భంగా ఒక మహిళను పాము కాటేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

దేవాస్‌కు చెందిన అక్షయ్ చౌహాన్ భార్య రిషిక, నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంటికి తీసుకువచ్చిన పాముకు పూజలు చేసింది. ఆ సమయంలో ఊహించని విధంగా ఆ పాము ఆమె చేతిపై కాటేసింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే రిషికను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం దేవాస్ జిల్లా ఆసుపత్రిలో రిషిక చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే అది ఏ రకానికి చెందిన పామో ఇంకా నిర్ధారణ కాలేదని తెలుస్తోంది. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నాగ పంచమి రోజునే జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనలో పామును ఇంటికి తెచ్చిన పాములవాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద ఉన్న పామును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక రోజు ముందే అడవి నుంచి ఆ పామును పట్టుకొచ్చినట్లు అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా, సంఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా తెలిసింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించి పామును జనావాసాల్లోకి తీసుకురావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం స్వాధీనం చేసుకున్న పామును అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నాగ పంచమి వంటి పండుగల సమయాల్లో బతికున్న పాములను పట్టుకొచ్చి ప్రజల వద్దకు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని జంతు సంరక్షణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాములను అనవసరంగా తాకకుండా సురక్షితమైన దూరం పాటించాలని సూచిస్తున్నారు. దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన, సంప్రదాయ పూజల సమయంలోనూ భద్రతను విస్మరించకూడదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.


Posted

in

by

Tags: