రష్యాలోని ఒక మెడికల్ యూనివర్సిటీకి చెందిన విదేశీ విద్యార్థుల హాస్టల్‌పై జరిగిన కిరాతక దాడిలో, 15 ఏళ్ల దుండగుడు హోలోకాస్ట్‌కు (Holocaust) మద్దతుగా జాతీయవాద నినాదాలు చేసినట్లు స్థానిక మీడియా నివేదించింది.
రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్లో ఉన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో శనివారం జరిగిన ఈ కత్తిపోట్ల దాడిలో కనీసం ఆరుగురు గాయపడగా, వారిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.
ఉగ్రవాద సంస్థతో సంబంధం? రష్యా సుప్రీంకోర్టు 2021లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ‘నేషనల్ సోషలిజం / వైట్ పవర్’ (NS/WP) అనే నయా-నాజీ (Neo-Nazi) ముఠాకు ఈ నిందితుడు చెందినట్లు ‘బాజా’ (Baza) ఛానెల్ తెలిపింది. ఈ ముఠాకు గతంలో జర్నలిస్టులపై జరిగిన దాడులతో సంబంధాలు ఉన్నాయి. హాస్టల్ గోడపై బాధితులలో ఒకరి రక్తంతో ‘స్వస్తిక’ గుర్తును చిత్రీకరించిన దృశ్యాలను కూడా సదరు వార్తా సంస్థ ప్రసారం చేసింది.
ఘటన వివరాలు: దుండగుడు హాస్టల్లోని పలువురు విద్యార్థులపై కత్తితో దాడి చేశాడని, అక్కడ అంతా రక్తసిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితుడు పోలీసులను ఎదిరించి ఇద్దరు అధికారులను గాయపరిచాడని, అనంతరం తనను తాను గాయపరుచుకున్నాడని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇరినా వోల్క్ తెలిపారు.
భారత రాయబార కార్యాలయం స్పందన: “ఉఫా (Ufa) నగరంలో జరిగిన ఈ దాడి దురదృష్టకరం. నలుగురు భారతీయ విద్యార్థులు సహా పలువురు గాయపడ్డారు. మేము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. కజాన్ (Kazan) లోని మన కాన్సులేట్ అధికారులు బాధితులకు సాయం చేసేందుకు ఉఫాకు బయలుదేరారు” అని రష్యాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. నిందితుడిని కూడా చికిత్స నిమిత్తం స్థానిక చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్కోకు తూర్పున 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉఫా నగర అధికారులు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.
