అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, ఇరాన్‌తో యుద్ధం వద్దు అంటూ అమెరికా మరియు యూరోప్‌లో ‘నో కింగ్స్’ (No Kings) పేరుతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి.
న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్ సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లో లక్షలాది మంది నిరసనకారులు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. ఈ ఉద్యమం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచంలోని 12 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. దాదాపు 3,300 ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం కోసం నిరసనలు జరిగాయి. సుమారు 80 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. మరోవైపు, ఇరాన్‌ను అన్ని వైపులా ముట్టడించేందుకు అమెరికా సిద్ధమైంది. సుమారు 50 వేల మంది అమెరికా సైనికులు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికుల సంఖ్య 50 వేలు దాటింది. యుద్ధం నేపథ్యంలో తాజాగా మరో 10 వేల మంది సైనికులను అదనంగా మోహరించారు. ఒక మీడియా నివేదిక ప్రకారం, ఈ సైనిక మోహరింపుతో ఇరాన్ చుట్టూ అమెరికా పట్టు బిగించింది. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనే సంకేతాలు వెలువడుతున్నాయి.
దాడులకు సిద్ధంగా ఉన్న అమెరికా దళాలు: అమెరికా సైన్యంలోని ’82వ ఎయిర్ బోర్న్ డివిజన్’కు చెందిన వేలాది మంది సైనికులు ఇరాన్ పై దాడికి సిద్ధంగా ఉన్నారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం మరియు ఇరాన్ దాడులకు గట్టి సమాధానం చెప్పడమే లక్ష్యంగా ఈ మోహరింపు జరిగింది. అయితే, ఇరాన్ వంటి పెద్ద దేశాన్ని నియంత్రించడానికి 50 వేల మంది సైనికులు సరిపోరని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ లోని ప్రధాన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపంతో పాటు 90 కంటే ఎక్కువ సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.
పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇప్పటివరకు నేరుగా చర్చలు జరగలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ.. ఈ సైనిక సన్నాహాలు ఒక సాధారణ ప్రక్రియ అని పేర్కొన్నారు.
