నాలుగేళ్లు కాపురం చేసిన భార్య హఠాత్తుగా మాయం! వెతుక్కుంటూ వెళ్లిన భర్తతో చెప్పిన మాటలివే: “నేను రాను.. ఇక్కడే ఉంటా!”.. తోటి మహిళా ఉద్యోగితో సహజీవనం!!

ఘజియాబాద్‌లో నాలుగేళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్న ఓ మహిళ అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోగా, ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన భర్తకు దిగ్భ్రాంతికర విషయం తెలిసింది.

ఆమె తనతో పాటు పనిచేసే మరో మహిళా ఉద్యోగితో కలిసి ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గత నెల రోజులుగా వీరిద్దరూ ఘజియాబాద్‌లోని ఖోడా ప్రాంతంలో ఉంటున్నట్లు సమాచారం. భార్య కనిపించకుండా పోవడంతో భర్త గతంలోనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఆమె కోసం గాలిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో భర్త, అతని కుటుంబ సభ్యులు వెతకగా ఆమె తన సహోద్యోగితో ఉన్న విషయం బయటపడింది. వీరిద్దరూ ఒకే ప్రైవేట్ సంస్థలో పనిచేసేవారని, అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా గాఢమైన స్నేహంగా మారినట్లు తెలిసింది. మరోవైపు, ఆ మహిళకు ఆమె భర్తతో తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండేవి. ఆగస్టు 12న జరిగిన గొడవ తర్వాత ఆమె ఇంటిని వదిలి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదని చెబుతున్నారు.

అటువైపు, ఆ సహోద్యోగి కుటుంబ సభ్యులు కూడా ఆమె కోసం గాలిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ ఖోడా ప్రాంతంలో కలిసి ఉంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని ఇద్దరితోనూ మాట్లాడారు. ఇంటికి తిరిగి వచ్చేయాలని ఎంత చెప్పినప్పటికీ, విడిపోవడానికి వారిద్దరూ నిరాకరించారు. ముఖ్యంగా, ఆ వివాహిత తన భర్తతో తిరిగి వెళ్లేందుకు నిరాకరిస్తూ, ఆ సహోద్యోగితోనే కలిసి ఉంటానని తెగేసి చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. భార్య అదృశ్యంపై భర్త ఇచ్చిన ఫిర్యాదు, వారు నివసిస్తున్న ప్రాంతం, కుటుంబ సభ్యులతో వారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత చోటుచేసుకున్న ఈ పరిణామం ఘజియాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: