నాసిక్: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ కార్యాలయం వేదికగా వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు కార్పొరేట్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఒకే కార్యాలయంలో ఎనిమిది మంది మహిళా ఉద్యోగినులు లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ గూడుపుఠాణీలో హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు విచారణలో తేలింది.
ఆఫీస్ వేళల తర్వాత అసలు కథ..
నిందితులు అనుసరించిన తీరు (Modus Operandi) అత్యంత ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిందితులు కంపెనీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ కార్యాలయంలోనే ఉండేవారు. ఆ సమయంలోనే మహిళా ఉద్యోగినులపై మానసిక ఒత్తిడి పెంచుతూ తమ వలలో వేసుకునేవారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ, కంపెనీ వనరులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు తేలింది.
హిందూ యువతులపై కన్ను.. మత మార్పిడికి ఒత్తిడి!
ఈ కేసులో సాక్షిగా ఉన్న ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఎన్డీటీవీతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. “హిందూ అమ్మాయిలను గర్ల్‌ఫ్రెండ్స్‌గా చేసుకోవాలని, వారిని పెళ్లి చేసుకుని మతం మార్చాలని నిందితులకు చెప్పేవారు. దీని కోసం వారికి భారీగా డబ్బులు కూడా అందేవి. 2021 నుంచే ఈ వ్యవహారం నడుస్తోంది. దీనికి సహకరించినందుకు హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్‌కు కూడా వాటాలు అందేవి” అని ఆయన పేర్కొన్నారు.
మహిళల ఆవేదన: ఎస్ఐటీ (SIT) రంగంలోకి..
ఫిబ్రవరి 2022 నుండి మార్చి 2026 మధ్య ఈ అకృత్యాలు జరిగినట్లు ఎనిమిది మంది మహిళా ఉద్యోగినులు ఫిర్యాదు చేశారు.
- వేధింపులు: సీనియర్లు తమను లైంగికంగా వేధించడమే కాకుండా, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసినట్లు ఒక బాధితురాలు పేర్కొన్నారు.
- అవమానాలు: మహిళల రూపురేఖలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను కించపరచడం నిత్యకృత్యంగా మారింది.
- బలవంతపు నమాజ్: ఒక హిందూ పురుష ఉద్యోగిని బలవంతంగా నమాజ్ చేయమని ఒత్తిడి చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
బెదిరించిన హెచ్ఆర్.. చివరకు కటకటాల్లోకి!
బాధితులు తమ గోడును హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్‌కు విన్నవించగా, ఆమె వారికి సహాయం చేయాల్సింది పోయి.. ఫిర్యాదు చేస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరించినట్లు బాధితులు వాపోయారు.
ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సిట్ (SIT) ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌తో పాటు డానిష్ షేక్, తౌసీఫ్ అత్తార్, రజా మెమన్, షారూఖ్ ఖురేషీ, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో మహిళా ఉద్యోగిని కోసం గాలిస్తున్నారు.
ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇలాంటి ‘మత మార్పిడి గ్యాంగ్’ కార్యకలాపాలు సాగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐటీ రంగంలో మహిళల భద్రతపై ఈ ఘటన మరిన్ని సందేహాలను లేవనెత్తుతోంది.
