బ్రిటన్‌కు చెందిన 49 ఏళ్ల మహిళ, తన మాజీ ప్రియుడితో బ్రేకప్ తర్వాత చేసిన వింత పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ తర్వాత అతడు మరో మహిళతో డేటింగ్ చేయడం ప్రారంభించాడని సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ, తన మాజీ ప్రియుడికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి పనీ వినూత్నమైన ప్రతీకారంగా మారింది.
ముందుగా, తన మాజీ ప్రియుడు నివసిస్తున్న ఇంట్లోని హీటర్‌ను 28 డిగ్రీల సెల్సియస్‌లో పెట్టి ఆపకుండా ఉంచేసింది. దీనివల్ల కరెంట్ బిల్లు భారీగా పెరిగేలా ఆమె ప్లాన్ చేసింది. ఇంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ కరెంట్ బిల్లును తాను కట్టాల్సిన అవసరం లేదు కాబట్టే ఇలా చేశానని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత, తన మాజీ ప్రియుడు తన మురికి బట్టలు ఉతకమని చెప్పినప్పుడు, వాటిని ఉతకకుండా అతని ఖరీదైన డిజైనర్ బ్రాండ్ లోదుస్తులను చెత్తబుట్టలో పడేసిందట.
ఆమె ప్రతీకారం అంతటితో ఆగిపోలేదు. ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు, తను సొంత డబ్బుతో కొన్న వస్తువులను మాత్రమే తీసుకువెళ్లాలనే నిబంధన ఒకటుంది. దీనిని అవకాశంగా తీసుకున్న ఆమె.. వంటగదిలోని అలమరాలకు ఉన్న హ్యాండిల్స్‌ను (పిడులు) ఒక్కొక్కటిగా ఊడదీసుకుని మరీ తీసుకెళ్లిపోయింది. ఆ హ్యాండిల్స్ తిరిగి ఇవ్వాలని మాజీ ప్రియుడు అడిగినప్పుడు, వాటిని తానే కొన్నానని చెప్పి ఇవ్వడానికి నిరాకరించిందట. దీంతో వంటగది అలమరాలు హ్యాండిల్స్ లేకుండా మిగిలిపోయిన ఘటన ఈ వ్యవహారంలో ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఈ సంఘటనలను గుర్తు చేసుకున్న ఆ మహిళ.. అప్పుడు ఆ కోపంలో తాను చేసిన పనులు ఇప్పుడు తలుచుకుంటే తనకే నవ్వొస్తోందని తెలిపింది. బ్రేకప్ సమయంలో ఎదురైన మానసిక బాధను అధిగమించేందుకే తనదైన శైలిలో ఇలా వ్యవహరించినట్లు ఆమె వెల్లడించింది. మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇంటి ఉష్ణోగ్రత పెంచడం నుంచి వంటగది హ్యాండిల్స్ తీసుకువెళ్లడం వరకు ఆమె చేసిన వింత పనులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ‘మిర్రర్ యూకే’ (Mirror UK) ప్రచురించిన కథనం ఆధారంగా వెలుగులోకి వచ్చాయి.

Leave a Reply