యూపీ పోలీస్ ఇన్స్పెక్టర్ వైరల్ వీడియో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక మహిళా సబ్-ఇన్స్పెక్టర్ (SI) వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న సమయంలో ఒక కారు ప్రయాణికుడిని ఉద్దేశించి ఆమె “నోట్లో మూత్రం పోస్తాను” అంటూ అత్యంత అసభ్య పదజాలంతో హెచ్చరించడం సంచలనం సృష్టించింది.
ఈ వీడియో వైరల్ కావడంతో అలీఘర్ ఎస్ఎస్పీ ఆమెను ‘లైన్ హాజర్’ (విధుల నుండి తొలగించి హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయమని) ఆదేశించారు. అయితే, ఇప్పుడు ఈ ఉదంతంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. సదరు మహిళా ఎస్ఐ రచనా రాఠీ మౌనం వీడి ఆ రాత్రి అసలేం జరిగిందో వివరించారు.
అసలు ఏం జరిగింది?
డిసెంబర్ 28 సాయంత్రం మీరట్‌లోని అబూలేన్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. విచారణలో ఆమె విధి నిర్వహణలో ఉన్నానని అబద్ధం చెప్పి, స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వచ్చినట్లు తెలిసింది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై ₹43,782 విలువైన 14 చలాన్లు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
‘నాపై చేయి వేస్తే ఊరుకోవాలా?’
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచనా రాఠీ తన వెర్షన్‌ను వినిపించారు. “నేను నా 75 ఏళ్ల అనారోగ్యంతో ఉన్న మామ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నాను. అప్పుడు ఒక కారు అడ్డదిడ్డంగా వచ్చి మా దారిని ఆపేసింది. నేను ప్రశ్నించగా, ఆ కారులోని యువకుడు కిందకు దిగి నా ఎదపై (Breast) చేయి వేశాడు. కారులో ఉన్న మహిళ నన్ను అసభ్యంగా దూషించింది. ఒక వ్యక్తి నా శరీరాన్ని తాకినప్పుడు నేను స్పందించకుండా ఎలా ఉంటాను? అయితే, ఆ కోపంలో నా నోటి నుండి వచ్చిన తప్పుడు మాటలకు నేను క్షమాపణ కోరుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.
సమాజంపై ప్రశ్నాస్త్రాలు
ఆ సమయంలో తాను యూనిఫాంలో లేనని, లోయర్ మరియు జాకెట్ ధరించి ఉన్నానని ఆమె చెప్పారు. “ఒక అమ్మాయి దెబ్బలు తిని ఇంటికి వచ్చినా లేదా అత్యాచారానికి గురైనా జనం పెద్ద ఇష్యూ చేస్తారు. కానీ అదే అమ్మాయి ఎదురుతిరిగి సమాధానం చెబితే మాత్రం ఆమె క్యారెక్టర్‌ను, ఉద్యోగాన్ని ప్రశ్నిస్తారు” అంటూ సమాజ వైఖరిని తప్పుబట్టారు. ప్రస్తుతం అలీఘర్ ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు ఈమెపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.
