గణపతి విగ్రహ నిమజ్జనం సందర్భంగా నదిలోకి దిగిన ఓ యువకుడు నీటిలో మునిగిపోగా, అతడిని కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు కూడా నీటిలో గల్లంతైన విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ షాకింగ్ దృశ్యం అక్కడున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్ కెమెరాలో రికార్డయి అందరినీ కలచివేస్తోంది.
సుమారు 16 నుంచి 17 మందితో కూడిన యువకుల బృందం మేళతాళాలతో వినాయక విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని తీసుకుని నీటిలోకి దిగగా, ప్రమాదవశాత్తు కాలు జారి లోతైన ప్రాంతంలో పడి మునిగిపోవడం మొదలైంది.
నీటిలో కొట్టుమిట్టాడుతున్న అజయ్‌ను కాపాడేందుకు ఒడ్డున నిలబడి ఉన్న నితీష్, శివకాంత్ అనే ఇద్దరు స్నేహితులు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నదిలోకి దూకారు. కానీ, నదిలో నీటి ప్రవాహం అత్యంత ఉద్ధృతంగా ఉండటంతో, ముగ్గురూ నీటి సుడిగుండంలో చిక్కుకుని క్షణాల్లోనే కళ్ల ముందే గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు శ్రమించిన తర్వాత అజయ్, నితీష్‌ల మృతదేహాలను వెలికితీయగా, గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
నీటిలో మునిగిపోయిన యువకులందరూ ఆ ప్రాంతంలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో కలిసి పనిచేస్తున్న స్నేహితులని తేలింది. అక్కడికి వీడియో తీయడానికి వచ్చిన ఓ వ్యక్తి కెమెరాలో ఈ ఘోర దృశ్యం రికార్డు కాగా, ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్ర విషాదంలో ముంచింది.

Leave a Reply