ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో, అపార్ట్మెంట్ నాల్గవ అంతస్తు నుంచి కిందపడి 27 ఏళ్ల కేఫ్ యజమాని శివ శర్మ మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని అవధ్ గ్రీన్ అపార్ట్మెంట్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం వెలువడింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన శివను పరీక్షించిన వైద్యులు, అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా పైనుంచి తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శివ తల్లి రంజనా శర్మ మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటల ప్రాంతంలో రష్మి దూబే అనే మహిళ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. శివకు ప్రమాదం జరిగిందని, ఆసుపత్రికి తరలిస్తున్నామని ఆ మహిళ చెప్పినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లగా అక్కడ శివ కనిపించలేదని, దాదాపు గంటన్నర తర్వాత అతను మరో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం (ICU)కి మార్చబడినట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అంతేకాకుండా, తన కొడుకును బంధించి చిత్రహింసలు పెట్టిన తర్వాతే భవనం పైనుంచి కిందకు తోసేశారని తల్లి ఆరోపించారు. శివ శరీరాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని, కళ్ళు, దవడ భాగంలో గాయాలు, ప్రక్కఎముకలు, కాళ్లు విరిగిపోయాయని, సిగరెట్‌తో కాల్చినట్లుగా శరీరాలపై గుర్తులు ఉన్నాయని ఆమె తెలిపారు. శివ లివ్-ఇన్ పార్ట్నర్తో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా గత 4-5 నెలలుగా వేధింపులు ఉన్నాయని, తనను కూడా బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ఇటు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివ నాల్గవ అంతస్తు నుంచి పడి మృతి చెందినట్లు నిర్ధారించిన పోలీసులు, అతను తోసివేయబడ్డాడా లేదా వేరే ఏదైనా కారణం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో సాంకేతిక మరియు ఫోరెన్సిక్ ఆధారాలతో విచారిస్తున్నట్లు తెలిపారు. శివ మృతికి అసలు కారణం ఏమిటనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం రాలేదు. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల నిజానిజాలు పోలీసు విచారణ ముగిసిన తర్వాతే వెల్లడవుతాయి.

Leave a Reply