హర్యానాలోని సిర్సా జిల్లా మహమ్మద్‌పురియా గ్రామంలో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక సాదాసీదా డ్రైవర్‌ను రూ. 10 కోట్ల భారీ లాటరీ వరించడమే ఇందుకు కారణం.
వివరాలు: 35 ఏళ్ల పృథ్వీ సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన కొన్ని రోజుల క్రితం డబ్వాలీ సమీపంలోని కిలియన్వాలి వద్ద ‘పంజాబ్ లోహ్రి-మకర సంక్రాంతి 2026 బంపర్ లాటరీ’ టికెట్‌ను కొనుగోలు చేశారు. పృథ్వీ తండ్రి దేవీలాల్ కూడా డ్రైవర్‌గానే పనిచేస్తున్నారు. పృథ్వీ తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలు మరియు తమ్ముడితో కలిసి నివసిస్తున్నారు.
ఈ అకస్మాత్తు అదృష్టంపై పృథ్వీ స్పందిస్తూ.. “ఇది నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ డబ్బుతో నా పిల్లల భవిష్యత్తును భద్రపరుస్తాను. ఇంతకుముందు రెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నాను కానీ ఏమీ రాలేదు. మూడవ ప్రయత్నంలోనే ఇంత పెద్ద బహుమతి వస్తుందని అస్సలు ఊహించలేదు” అని ఆనందం వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యుల ఆనందం: పృథ్వీ భార్య సుమన్ రాణి ఒక పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్నారు. “మా పిల్లల కలలను నెరవేర్చుకోవడానికి ఈ డబ్బును ఉపయోగిస్తాం” అని ఆమె తెలిపారు. వారి ఆరేళ్ల కుమారుడు దక్ష్ మాత్రం తనకు ఒక పెద్ద లగ్జరీ కారు కావాలని ముద్దుముద్దుగా చెబుతున్నాడు.
లాటరీ విక్రేత మదన్ సింగ్ మాట్లాడుతూ.. తన వద్ద టికెట్లు కొన్నవారు గతంలోనూ విజేతలుగా నిలిచారని, అయితే రూ. 10 కోట్ల భారీ బహుమతి రావడం చాలా విశేషమని అన్నారు. ఈ విజయం పృథ్వీ కుటుంబంలోనే కాకుండా మొత్తం గ్రామంలో సంతోషాన్ని నింపిందని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు.
