గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లాలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిన అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను వదిలేసి వచ్చిన ఓ వివాహిత, మరొక వ్యక్తితో కలిసి వేరుగా జీవిస్తోంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మహిళ భర్త, అతని బంధువులు కలిసి ఆమెను ఒక గదిలో బంధించి, గొలుసులతో కట్టేసి విచక్షణారహితంగా చితకబాదారు.
అక్కడి నుంచి ఆ బాధితురాలు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ, వెంబడించి మరీ తిరిగి పట్టుకున్నారు. అనంతరం ‘శుద్ధి’ పేరుతో ఆమెను ఒక చెట్టుకు తాళ్లతో కట్టేసి అమానుషంగా చిత్రహింసలకు గురిచేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ అకృత్యాన్ని చూసి ఇతరులు భయపడాలనే పైశాచిక ఆలోచనతో నిందితులు మొత్తం ఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయి విపరీతంగా వైరల్ కావడంతో ఈ దారుణం పోలీసుల దృష్టికి చేరింది.
వెంటనే రంగంలోకి దిగిన సురేంద్రనగర్ ఎస్పీ (SP) నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం.. వీడియో ఆధారంగా బాధిత మహిళను గుర్తించి సురక్షితంగా కాపాడింది. అనంతరం ఈ దుశ్చర్యకు పాల్పడిన భర్త సహా మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై కూడా పోలీసులు తీవ్ర నిఘా ఉంచి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
