“నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది..! ఒక అంబులెన్స్ కూడా ఇవ్వలేరా?”.. తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన వృద్ధుడు.. కట్టెలు కొనేందుకు కూడా డబ్బుల్లేక చివరకు ఖననం.. కంటతడి పెట్టిస్తున్న విషాదం..!

బీహార్‌లోని జముయి జిల్లా జాఝా రైల్వే కాలనీ ప్రాంతంలో నివసించే 60 ఏళ్ల శివకుమార్ దాస్, ఆయన భార్య రాఖీ దేవి (60) తీవ్ర పేదరికంలో మగ్గుతూ, బంధువుల ఆసరా ఏమీ లేక నిస్సహాయంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాఖీ దేవి ఇంట్లోనే కన్నుమూశారు. జీవితాంతం తోడున్న భార్య ఆకస్మిక మరణం ఆ వృద్ధుడిని శోకసంద్రంలో ముంచగా, అంతకంటే పెద్ద కష్టం ఆమె అంత్యక్రియలు జరపడంలో ఎదురైంది.

భార్య మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు అంబులెన్స్ లేదా మున్సిపాలిటీ శవవాహనం కోసం ఆ వృద్ధుడు అధికారులను వేడుకున్నారు. అయితే అటు వైద్యారోగ్య శాఖ నుంచి గానీ, ఇటు మున్సిపల్ యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి సహాయం అందలేదు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ వృద్ధుడు ప్రైవేట్ వాహనాన్ని సమకూర్చుకోలేకపోయారు. ఇక వేరే మార్గం లేక, కొందరు స్థానిక యువకుల సాయంతో ఒక పాత తోపుడు బండిని తెచ్చి, దానిపై భార్య మృతదేహాన్ని ఉంచి స్వయంగా నెట్టుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు.

దారిలో ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. అంత్యక్రియల కోసం కనీసం దహన కట్టెలు కొనేందుకు కూడా డబ్బుల్లేక ఆ వృద్ధుడు పడుతున్న వేదనను చూసి స్థానిక వార్డు సభ్యుడు తన సొంత డబ్బు రూ. 2,000 ఇచ్చి సాయం చేశారు. అయినప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో, చేసేది లేక సాధారణ గుంత తవ్వి భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టారు (ఖననం చేశారు).

బీహార్ ప్రభుత్వం పేద కుటుంబాల అంత్యక్రియల కోసం ‘కబీర్ అంత్యేష్టి యోజన’ ద్వారా ఆర్థిక సాయం, ఉచిత వాహనాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇలాంటి అభాగ్యులకు ఆ పథకాలు ఎందుకు అందడం లేదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతామని చెబుతున్నప్పటికీ.. కడు పేదరికంలో ఉన్న ఒక వృద్ధుడు తన సొంత భార్యకు గౌరవప్రదంగా వీడ్కోలు కూడా పలకలేని ఈ దుస్థితి సమాజంలో మానవత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది!


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *