“నా మొగుడితో నువ్వు తిరుగుతున్నావా..?” మైక్ పెట్టి ఊరందరి ముందూ పరువు తీసిన భార్య.. బయట తలెత్తుకోలేక, అవమానంతో తనువు చాలించిన మహిళ!

మధ్యప్రదేశ్‌లో వివాహేతర సంబంధం వ్యవహారం, దాన్ని ఊరందరి ముందూ బట్టబయలు చేసిన పద్ధతి ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన మమతా యాదవ్ (32) అనే మహిళకు రామ్‌హేత్ యాదవ్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్‌హేత్ పండ్ల దుకాణంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర యాదవ్ అనే వ్యక్తితో మమతకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఆ సంభాషణలను సురేంద్ర తన మొబైల్‌లో రహస్యంగా రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అయితే అనుకోకుండా ఆ ఆడియో రికార్డింగులు సురేంద్ర భార్య రేఖా యాదవ్ చేతికి చిక్కాయి.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రేఖ, గత సోమవారం ఇంటి బయట సౌండ్ సిస్టమ్ (స్పీకర్లు) పెట్టి.. మమత, సురేంద్ర మాట్లాడుకున్న ఆడియోను వీధిలోని వారందరికీ వినిపించేలా పెద్ద శబ్దంతో ప్లే చేసింది. ఇది విని తీవ్ర దిగ్భ్రాంతికి, అవమానానికి గురైన మమత.. ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. అదే రోజు సాయంత్రం పని ముగించుకుని భర్త రామ్‌హేత్ ఇంటికి వచ్చేసరికి, మమత అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశుడయ్యాడు. పక్కనే పురుగుల మందు బాటిల్ ఉండటాన్ని గమనించి, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మమత ప్రాణాలు విడిచింది. తన భార్య ఆత్మహత్యకు పక్కింటి సురేంద్ర యాదవ్, అతని భార్య రేఖ, రాజ్‌పాల్ యాదవ్ మరియు వారి కుటుంబ సభ్యులే కారణమని, గత ఏడాదిన్నర కాలంగా వారు మమతను నిరంతరం బెదిరిస్తూ వేధించారని భర్త రామ్‌హేత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల ఫోన్లను, ఆడియో రికార్డింగులను స్వాధీనం చేసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: