నా మొగుడు నచ్చలేదు.. 3 సార్లు ఇల్లు వదిలి వెళ్లినా వదలడం లేదు; ఊరంతా పంచాయతీ పెట్టినా వినని భార్య.. వివాహేతర సంబంధం కోసం భర్తను చంపిన వైనం!

కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో, భార్యే సుపారీ గ్యాంగ్‌తో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆ దంపతులు (ప్రియుడు-భార్య) వేసిన ప్లాన్ పోలీసుల విచారణలో బట్టబయలైంది.

యాదగిరి తాలూకా, సమనహళ్లి తండాకు చెందిన సాగర్ రాథోడ్ (35) భార్య పూజ. అదే గ్రామానికి చెందిన రెడ్డి రాథోడ్‌తో పూజకు గత మూడేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో గ్రామ పంచాయతీలో పలుమార్లు పంచాయతీలు జరిగినప్పటికీ, పూజ తన ప్రియుడిని వదలడానికి నిరాకరించడమే కాకుండా, అతనితో కలిసి మూడుసార్లు ఇల్లు వదిలి పారిపోయింది.

తమ సంబంధానికి సాగర్ రాథోడ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పూజ మరియు ఆమె ప్రియుడు రెడ్డి రాథోడ్, అతడిని అంతమొందించాలని పథకం వేశారు. దీని కోసం మహేష్ అనే ఆటో డ్రైవర్‌ను సంప్రదించి, సాగర్‌ను చంపడానికి రూ. 1 లక్ష సుపారీ (కూలి) ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు.

పథకం ప్రకారం, గత మార్చి 22వ తేదీ రాత్రి అద్దె ఆటో దొరుకుతుందని చెప్పి సాగర్‌ను బయటకు రప్పించారు. ఆటోలో లింగరి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ సుత్తితో దాడి చేసి సాగర్‌ను కిరాతకంగా చంపేశారు.

హత్య అనంతరం సాగర్ మృతదేహాన్ని కారులో ఎక్కించి ఒసహళ్లి ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ముందుగా అనుకున్నట్లుగా ఒక ఆటోతో కారును ఢీకొట్టి, సాగర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నాటకమాడారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అది ప్రమాదంలా కాకుండా హత్య అనే అనుమానం కలిగింది. సాగర్ సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా, హత్యకు కొన్ని గంటల ముందు మహేష్ అనే వ్యక్తితో నిరంతరం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో మహేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, హత్య వెనుక ఉన్న అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. భార్య పూజ, ఆమె ప్రియుడు రెడ్డి రాథోడ్ కలిసి ఈ కుట్ర పన్నినట్లు తేలింది. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన యాదగిరి గ్రామీణ పోలీసులు వారిని జైలుకు తరలించారు.


Posted

in

by

Tags: