ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ ప్రాంతంలో పాము కాటుకు గురైన తన తమ్ముడిని, వైద్యుల హెచ్చరికల మేరకు మెలకువగా ఉంచేందుకు ఓ అన్న పడిన ఆరాటం ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతూ అందరి హృదయాలను కదిలిస్తోంది.
హర్దోయ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని విషసర్పం కాటేసింది. విషం ఒళ్లంతా పాకడంతో ఆ యువకుడికి తీవ్రమైన మగత, నిద్ర రావడం మొదలైంది. వెంటనే అతని సోదరుడు అతడిని మోసుకుంటూ సమీపంలోని ఆసుపత్రికి పరుగులు తీశాడు. ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు.. విషం ప్రభావం తీవ్రంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని నిద్రపోనివ్వకూడదని, ఒకవేళ నిద్రపోతే ప్రాణాలు కాపాడటం కష్టమవుతుందని హెచ్చరించారు.
తమ్ముడి ప్రాణాలు దక్కాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న ఆ అన్న.. తమ్ముడు కళ్లు మూయకుండా ఉండేందుకు నిరంతరం అతని ముఖంపై మెల్లగా తడుతూ, చెంపలు వాయిస్తూ మెలకువగానే ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. మరోవైపు వైద్యులు తక్షణమే స్పందించి, ఆ యువకుడికి దాదాపు 15 యాంటీ వీనమ్ (విష విరుగుడు) ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందించారు.
వైద్యుల అత్యవసర చికిత్స అనంతరం విష ప్రభావం పూర్తిగా తగ్గి, ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అన్నాతమ్ముళ్ల అనుబంధాన్ని, ప్రాణాల కోసం సాగిన ఆ పోరాటాన్ని తెలియజేసే ఈ భావోద్వేగ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
