నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన 2026 నీట్ పరీక్ష ఫలితాల్లో, పంజాబ్ రాష్ట్రం లూధియానాకు చెందిన ఆర్యన్ గుప్తా 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి, ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు.
ప్రారంభంలో ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల కారణంగా మే నెలలో జరిగిన పరీక్ష రద్దయినప్పుడు అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అయినప్పటికీ, ఏమాత్రం అధైర్యపడకుండా తన కష్టాన్ని నమ్ముకున్న ఆర్యన్.. జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్ (మరుపరీక్ష)లో ఈ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. హర్యానాకు చెందిన బన్షుల్ బన్సాల్‌తో కలిసి అతను దేశంలోనే మొదటి ర్యాంకును పంచుకున్నాడు.
ఆర్యన్ గుప్తా సాధించిన ఈ భారీ విజయం వెనుక ఒక బలమైన ఆశయం, వ్యక్తిగత విషాదం దాగి ఉన్నాయి. అతను 3వ తరగతి చదువుతున్న సమయంలో, అతని నానమ్మ 4వ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించింది. ఆర్యన్ తండ్రి డాక్టర్ సచిన్ గుప్తా అనస్థీషియాలజిస్ట్‌గా, తల్లి డాక్టర్ రీనా గుప్తా గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కుటుంబమంతా వైద్యులే అయినప్పటికీ, ఆ అత్యవసర సమయంలో నానమ్మను కాపాడుకోలేకపోయారు. ఈ విషాద ఘటన ఆర్యన్ మనస్సుపై బలమైన ముద్ర వేసింది. భవిష్యత్తులో ఒక గొప్ప క్యాన్సర్ నిపుణుడు (ఆంకాలజిస్ట్)గా మారి, ఈ ప్రాణాంతక వ్యాధిపై పోరాడాలనే కలను అతనిలో నాటింది.
తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆర్యన్ గుప్తా ప్రతిరోజూ 16 నుండి 17 గంటల పాటు నిరంతరం చదివాడు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా, తీవ్రమైన ఒత్తిడిని అధిగమిస్తూ శ్రమించానని చెప్పే ఆర్యన్.. ఈ పరీక్ష కేవలం ప్రారంభం మాత్రమేనని, వైద్య కళాశాలలో చేరి క్యాన్సర్‌ను నయం చేసే తన అసలైన ప్రయాణాన్ని ఇకపైనే ప్రారంభించాల్సి ఉందని తెలిపాడు.
గతేడాది ఆర్యన్ అన్నయ్య నీట్ పరీక్షలో 54వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతుండగా, అతనిని చూసి స్ఫూర్తి పొందిన ఆర్యన్ ఇప్పుడు మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. భవిష్యత్తులో నీట్ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆర్యన్ ఇస్తూ.. “మీ ఉపాధ్యాయులను పూర్తిగా నమ్మండి, కుంటిసాకులు వెతకకుండా క్రమశిక్షణ, అంకితభావంతో నిరంతరం శ్రమించండి” అని సలహా ఇచ్చాడు.
