“నీకు 6 లా అనిపించింది నాకు 9 అనిపించవచ్చు”.. చైనా రోబోను తమదిగా చెప్పుకుని గల్గోటియాస్ యూనివర్సిటీ పరువు తీసిన ప్రొఫెసర్ నేహా రాజీనామా!

AI ఇంపాక్ట్ సమిట్ 2026: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన AI సమిట్ ఇది. ప్రపంచ వేదికపై భారత్ తన సత్తా చాటుతున్న వేళ, గల్గోటియాస్ యూనివర్సిటీ చేసిన ఒక అబద్ధం అంతర్జాతీయ స్థాయిలో దేశ పరువు తీసింది. చైనాకు చెందిన రోబోటిక్ కుక్కను యూనివర్సిటీ స్వయంగా తయారు చేసిందని ప్రదర్శనలో పెట్టడమే కాకుండా, ప్రొఫెసర్ నేహా సింగ్ ఆ అబద్ధాన్ని నిజం అని నమ్మబలికేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

ఈ వివాదం ముదరడంతో యూనివర్సిటీ యాజమాన్యం ప్రొఫెసర్ నేహా సింగ్‌ను పదవి నుంచి తొలగించింది. ఆమె కమ్యూనికేషన్స్ విభాగం హెడ్ (HOD)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె రాజీనామాపై యూనివర్సిటీ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆమె ఒక వీడియోలో వింత వివరణ ఇచ్చారు. “మేము ఎప్పుడూ దీనిని తయారు చేశామని క్లెయిమ్ చేయలేదు.. డెవలప్‌మెంట్ అంటే డిజైన్ చేసి తయారు చేయడం మాత్రమే కాదు.. మీ దృష్టిలో అది 6 అయితే నా దృష్టిలో 9 కూడా అనిపించవచ్చు” అంటూ ఆమె వాదించడం గమనార్హం.

అసలేం జరిగింది?
ఇండియా AI సమిట్‌లో ప్రొఫెసర్ నేహా సింగ్ ఒక రోబోట్ కుక్కను ప్రదర్శిస్తూ దాని పేరు ‘ఓరియన్’ అని చెప్పారు. దీనిని యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తయారు చేశామని, ఇది క్యాంపస్‌లో సర్వైలెన్స్ (పర్యవేక్షణ) పనులను నిర్వహిస్తుందని మీడియాకు వివరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వెంటనే అది చైనా కంపెనీ ‘యూనిట్రీ’ (Unitree)కి చెందిన Go2 మోడల్ అని గుర్తించారు. ఆన్ లైన్‌లో ఇది కేవలం రూ. 2-3 లక్షలకే దొరుకుతుంది. యూనివర్సిటీ అబద్ధం బయటపడటంతో భారత ప్రభుత్వం సమిట్ నుండి గల్గోటియాస్ స్టాల్‌ను వెంటనే ఖాళీ చేయించింది.

ప్రొఫెసర్ నేహా సింగ్ ఎవరు?
నేహా సింగ్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుండి 2006లో MBA పూర్తి చేశారు. నవంబర్ 2023 నుండి గల్గోటియాస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు శారదా యూనివర్సిటీ, గీతం (GITAM) యూనివర్సిటీలలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె బిజినెస్ స్కూల్‌లో కమ్యూనికేషన్ విభాగం హెడ్‌గా ఉన్నారు తప్ప, టెక్నికల్ విభాగంలో సభ్యురాలు కాదు.

వివరణ ఇస్తూ మరింత దొరికిపోయారు:
వివాదం పెరగడంతో ఆమె PTI వార్తా సంస్థతో మాట్లాడుతూ.. తాను రోబోట్ తయారీ వివరాల గురించి తెలియక అలా మాట్లాడానని, విద్యార్థులను ప్రోత్సహించడమే తన ఉద్దేశమని చెప్పారు. రోబోట్ మీద ఇప్పటికే కంపెనీ లోగో ఉందని, అలాంటప్పుడు వేరే వాళ్ల వస్తువును తమది అని ఎలా చెబుతామని ప్రశ్నించారు. అయితే సోషల్ మీడియాలో ఆమె మొదట మాట్లాడిన వీడియోకు, ఇప్పుడు ఇస్తున్న వివరణకు పొంతన లేకపోవడంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.


Posted

in

by

Tags: