చైనాలో మనవళ్లను చూసుకునే విషయంలో తలెత్తిన కుటుంబ గొడవలో, కోడలు జరిపిన దాడిలో అత్తగారి నాలుగు పక్కటెముకలు విరిగిన సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చైనాకు చెందిన షెన్ అనే వృద్ధురాలు, తన భర్త చనిపోయిన తర్వాత వేర్వేరు నగరాల్లో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు జియావో మరియు కోడలి ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ క్రమంలో, ఒక రోజు ఒక చిన్నారికి తీవ్రమైన జ్వరం వచ్చి ఆరోగ్యం క్షీణించింది. ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరా ద్వారా తన బిడ్డకు ఒంట్లో బాగోలేదనే విషయాన్ని గమనించిన తల్లి, ఆందోళనతో కంగారుగా ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చింది.
ఇంటికి వచ్చిన కోడలు, బిడ్డను సరిగ్గా చూసుకోకపోవడంపై అత్తగారితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో అత్తగారు షెన్ స్పందిస్తూ.. “ఈ పిల్లలను చూసుకోవడం కంటే నేను చావడమే మేలు, నేను నా ప్రియుడిని కలవడానికి వెళ్లాలి” అని చెబుతూ ఆసుపత్రికి రావడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న కోడలు, తన అత్తగారిపై కిరాతకంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ వృద్ధురాలి 4 పక్కటెముకలు విరిగాయి.
ఈ ఘటనలో అత్తగారి కూతుళ్లు తమ తల్లికి మద్దతుగా నిలవగా, స్వయానా ఆమె కొడుకు మాత్రం కన్నతల్లిని కాపాడకపోగా తన భార్య చేసిన హింసాత్మక చర్యను సమర్థించాడు. “కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ మాకు సహాయం చేయలేదు, కాబట్టి ఆమె శిక్షార్హురాలే” అని కొడుకు చెప్పడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరోవైపు, చాలా ఏళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికురాలిగా కష్టపడిన తమ తల్లికి, వృద్ధాప్యంలో తన కోసం ఒక తోడును వెతుక్కునేందుకు మరియు సొంత జీవితాన్ని గడిపేందుకు పూర్తి హక్కు ఉందని వృద్ధురాలి కుమార్తెలు తమ సోదరుడికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
