ఉత్తరప్రదేశ్: బరేలీలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్ళిన ఒక మహిళపై సబ్-ఇన్ స్పెక్టర్ ఆశ చూపి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
భర్తతో గొడవ జరిగి ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితురాలినే, చట్టాన్ని కాపాడాల్సిన అధికారి వేధించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బరేలీ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్-ఇన్ స్పెక్టర్ నరేష్ బాబు, మొదట ఆ మహిళతో చాలా సానుభూతిగా మాట్లాడారు. ఆ తర్వాత “నువ్వు చాలా అందంగా ఉన్నావు” అంటూ ఆమెను వర్ణించడం మొదలుపెట్టారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపారు. “నీ కోసం నా భార్యను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని నమ్మబలికి, ఏడాదిగా వివాహం చేసుకుంటానని అబద్ధపు హామీలు ఇచ్చి, ఆమెను లొంగదీసుకుని లైంగికంగా వేధించారని ఆరోపణ.
కాలక్రమేణా నరేష్ బాబు తనను మోసం చేస్తున్నాడని, బెదిరిస్తున్నాడని గ్రహించిన బాధితురాలు, దీనికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది. నిన్న సాయంత్రం జిల్లా ఎస్ఎస్పీ (SSP) కార్యాలయానికి నేరుగా వెళ్లి సబ్-ఇన్ స్పెక్టర్ అరాచకాలపై సంచలన ఫిర్యాదు చేసింది. తనను వేధించిన నరేష్ బాబుతో పాటు, అతనికి సహకరించిన అతని భార్య, కుమారులపై కూడా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
ఈ విషయం పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఎస్ఎస్పీ వెంటనే ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రాథమిక చర్యగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్-ఇన్ స్పెక్టర్ నరేష్ బాబును వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారి స్వయంగా ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
