రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో అల్లుడే స్వయంగా అత్తను అతి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బన్స్వారా హౌసింగ్ బోర్డు కాలనీలో లలితా దేవి అనే మహిళ ఇంట్లో ఉన్న సమయంలో, ఆమె అల్లుడు సోనూ అక్కడికి వచ్చి తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన సోనూ, అత్త లలితా దేవిపై దాడి చేసి అక్కడికక్కడే హత్య చేసి పారిపోయాడు.
సమాచారం అందుకున్న కొత్వాలీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సోనూ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరోవైపు మృతురాలి కుమార్తె లక్ష్మి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఆ కుటుంబంలో ఎప్పటినుంచో సాగుతున్న వేధింపులను బయటపెట్టింది. సోనూ, లక్ష్మిలకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచే సోనూ తనపై అనుమానం పెంచుకుని, రోజూ మద్యం తాగి వచ్చి తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టేవాడని లక్ష్మి కన్నీటిపర్యంతమైంది.
భర్త వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన లక్ష్మి, తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వచ్చేసింది. భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో రగిలిపోయిన సోనూ, అత్తతో గొడవపడి ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
