“నువ్వు మా కులం కాదు..”: ప్రేమ వివాహం చేసుకున్న వివాహితపై అత్తమామల అఘాయిత్యం.. 8 సార్లు బలవంతంగా గర్భస్రావం !

నాసిక్: ప్రేమ వివాహం చేసుకుని సంతోషంగా జీవించాలనుకున్న ఒక వివాహిత జీవితంలో అత్యంత కిరాతకమైన మరియు షాకింగ్ ఘటన నాసిక్‌లో వెలుగుచూసింది. “నువ్వు వేరే కులానికి చెందిన దానివి, నీ పిల్లలను మేము అంగీకరించము” అని సాకు చూపి, అత్తమామలు ఆ మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా, ఏకంగా 8 సార్లు బలవంతంగా గర్భస్రావలు చేయించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నాసిక్‌లోని మస్రుల్ పోలీస్ స్టేషన్‌లో భర్త, అత్త మరియు మామలపై కేసు నమోదు చేశారు.

“కులం వేరు” అంటూ వేధింపులు
బాధితురాలు ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత అత్తమామలు “నువ్వు మా కులం కాదు, నీ పిల్లలను మేము స్వీకరించము” అని నిత్యం వేధించడం మొదలుపెట్టారు. ఈ వివక్షతోనే వారు ఆమెపై ఒత్తిడి తెచ్చి, ఆమె ఇష్టం లేకుండానే గర్భవతి అయిన ప్రతిసారీ గర్భపాతం చేయించేవారు. ఇలా ఏకంగా 8 సార్లు జరగడం గమనార్హం.

మానసిక వేధింపులు, ఆసుపత్రిలో వేస్తామంటూ బెదిరింపులు
నిత్యం తిడుతూ మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, “నిన్ను పిచ్చిదానిగా ముద్రవేసి మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తాం” అని వారు బెదిరించేవారు. గతంలో బాధితురాలు, ఆమె భర్త పూణేలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారు. అయితే, జూలై 2025లో ఉద్యోగం పోవడంతో వారు నాసిక్‌కు తిరిగి వచ్చారు. నాసిక్‌కు వచ్చిన తర్వాత ఆమెపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.

నగలు, డబ్బు కోసం దోపిడీ
శారీరక, మానసిక వేధింపులతో పాటు, బాధితురాలిని ఆర్థికంగా కూడా దోచుకున్నారు. నాసిక్‌లో ఇల్లు కొంటామనే సాకుతో ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను అమ్మించి ఆ డబ్బును కాజేశారు. అంతేకాకుండా, పుట్టింటి నుండి మరిన్ని డబ్బులు, కట్నం తేవాలని ఆమెపై నిత్యం ఒత్తిడి తెచ్చేవారు. కేవలం కులం పేరుతో ఆమెను గౌరవంగా జీవించనివ్వకుండా అత్తగారింటి వారు నరకం చూపారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


Posted

in

by

Tags: