“నువ్వు రాంగ్ రూట్‌లో వచ్చి మళ్లీ రాంగ్‌గా మాట్లాడుతున్నావా..?” గుండెలవిసేలా ఏడ్చిన 14 నెలల పసికందు.. ఏమాత్రం కనికరం లేకుండా కారును అడ్డుకుని బెదిరించిన బైకరు.. తప్పంతా అతడిదే అయినా పొగరు చూశారా.. షాకింగ్ వీడియో..!!

మహారాష్ట్రలోని థానే జిల్లా పరిధిలోని ఓ ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండే వాహనాల రాకపోకల కూడలి.

అక్కడ అక్టోబర్ 6వ తేదీన, తమ 14 నెలల పసిబిడ్డతో కలిసి ఒక దంపతులు కారులో ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ‘టిప్ టాప్ ప్లాజా’ సమీపంలోకి కారు చేరుకుంటున్న సమయంలో, అనూహ్యంగా ఎదురుగా ఒక బైక్ రాంగ్ రూట్‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చింది.

యూ-టర్న్ తీసుకోవడానికి కేటాయించిన ఆ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా వచ్చిన ఆ బైకర్ కారును అడ్డగించి ఆపాడు. తప్పు తనవైపు ఉందని గ్రహించి పక్కకు వెళ్లాల్సింది పోయి, ఆ బైకరు కారులోని దంపతులతో దురుసుగా గొడవకు దిగాడు. “నువ్వు కావాలనే నా బైకును ఢీకొట్టాలని చూశావు” అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ, కారు తలుపును బలంగా బాదడం ప్రారంభించాడు.

కారులో ఉన్న స్వీటీ పాండే వర్మ అనే మహిళ ఈ ఘటనా దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీయడం మొదలుపెట్టడంతో, ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. కారు కిటికీలోంచి లోపలికి చేయి పెట్టి, డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆమె భర్తపై దాడి చేయడానికి యత్నించాడు. “నేను రాంగ్ సైడ్‌లో వస్తే నీకేంటి?” అంటూ బెదిరింపు ధోరణిలో కేకలు వేశాడు.

అతడు మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. కారు వెలుపల జరుగుతున్న ఈ భయానక గొడవను చూసి, కారు లోపల ఉన్న 14 నెలల పసికందు తీవ్ర భయాందోళనతో గుండెలవిసేలా ఏడవడం మొదలుపెట్టింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు జోక్యం చేసుకుని, ఆ బైకరును అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్వీటీ పాండే వర్మ.. థానే జిల్లా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ వ్యక్తిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒక్క రాత్రిలోనే 3 లక్షలకు పైగా వీక్షణలను సొంతం చేసుకున్న ఈ వీడియో, మహారాష్ట్రలో రహదారి భద్రతపై పెద్ద ఎత్తున చర్చను లేవనెత్తింది. అయితే, ఈ సంఘటనపై థానే పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కేసూ నమోదు చేయలేదు, అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *