తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో మానవత్వం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడనే కోపంతో, అత్త తన కోడలి తల నరికి చంపేసింది. అంతటితో ఆగక, తలను ఒకచోట, మొండాన్ని మరోచోట పాతిపెట్టి ఏమీ తెలియనట్లు నాటకమాడింది.
మాంత్రికుడి దగ్గరికి వెళ్దామని నమ్మించి కోడలిని పొట్టనబెట్టుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నేపథ్యం:
కళ్లకురిచ్చి జిల్లా శంకరపురం వలయాంబట్టు గ్రామానికి చెందిన రాజా అనే కూలీకి, బెంగళూరుకు చెందిన నందిని (29) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఏడేళ్ల క్రితం రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత నందిని తన పిల్లలతో కలిసి ఒంటరిగా నివసిస్తుండగా, మరియ రోసారియో (36) అనే ఫిజియోథెరపిస్ట్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, ఆరేళ్ల క్రితం వారు రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
అత్తా కోడళ్ల గొడవ:
మరియ రోసారియో తల్లి క్రిస్టోప్ మేరీకి, తన కొడుకు నందినిని రెండో పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. దీంతో అత్తా కోడళ్ల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. వేధింపులు భరించలేక నందిని తన భర్తతో కలిసి పక్క ఊరిలో అద్దె ఇంట్లో ఉంటోంది. కొంతకాలంగా అత్తతో నందిని మాట్లాడటం లేదు.
నమ్మించి తీసుకెళ్లి..
గత నెల 29న అత్త క్రిస్టోప్ మేరీ అకస్మాత్తుగా నందినికి ఫోన్ చేసింది. “మన మధ్య గొడవలు పోవాలంటే ఒక మాంత్రికుడితో పూజ చేయించాలి. నువ్వు వస్తే చాలు, అన్నీ సర్దుకుంటాయి” అని నమ్మబలికింది. అత్త మాటలను నమ్మిన నందిని ఆమె వద్దకు వెళ్లింది. ఆ తర్వాత నందిని కనిపించకుండా పోయింది. భర్త అడిగితే అత్త పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నరికి చంపేశాను..
పోలీసులు క్రిస్టోప్ మేరీని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. “నా కొడుకుకు రెండో భార్యగా నందిని రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాను. పూజల పేరుతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికేశాను. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే, తలని మొండెం నుండి వేరు చేశాను” అని నిందితురాలు ఒప్పుకుంది.
అత్త అరెస్ట్:
తల ఒక చోట, మొండెం ఒక చోట పాతిపెట్టినట్లు ఆమె పోలీసులకు చెప్పింది. ఈ దారుణానికి తన స్నేహితురాలు కూడా సహకరించిందని తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. కిరాతకానికి ఒడిగట్టిన అత్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను సంచలనంగా మారింది.
