నూడుల్స్ పార్శిల్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎలుక పిల్ల.. డబ్బా తెరవగానే నివ్వెరపోయిన కస్టమర్.. నెట్టింట దుమారం రేపుతున్న వీడియో..!

హాంకాంగ్‌లోని క్వై చుంగ్ ప్రాంతంలో ఉన్న ‘వా జెర్’ అనే రెస్టారెంట్‌లో కొనుగోలు చేసిన నూడుల్స్ పార్శిల్‌లో అప్పుడే పుట్టిన ఎలుక పిల్ల ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

గత సోమవారం మధ్యాహ్నం ఓ మహిళా కస్టమర్ ఈ రెస్టారెంట్‌లో ‘సాటే బీఫ్ నూడుల్స్’ తదితర ఆహార పదార్థాలను పార్శిల్ తీసుకున్నారు. ఇంటికి వెళ్లి తినేందుకు బాక్స్ తెరవగానే, చిక్కటి గ్రేవీ మధ్యలో రోమాలు కూడా రాని ఒక చిన్న ఎలుక పిల్ల ప్రాణాలతో కాళ్లు చేతులు ఆడిస్తూ కొట్టుమిట్టాడటం చూసి ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ వికారమైన దృశ్యాన్ని సదరు మహిళ వెంటనే తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, ఆందోళన వ్యక్తమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు హాంకాంగ్ ఆహార, పర్యావరణ పరిశుభ్రత విభాగం అధికారులు తక్షణమే స్పందించి, ఆహారంలోని ఎలుక పిల్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపించారు.

అనంతరం సంబంధిత రెస్టారెంట్‌లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అక్కడ కనీస పారిశుద్ధ్యం పాటించకపోవడమే కాకుండా, ఆహార తయారీలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. దీంతో ఆహార భద్రతా చట్టాల కింద ఆ రెస్టారెంట్‌పై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. రెస్టారెంట్లలో కచ్చితమైన పరిశుభ్రతా ప్రమాణాలు అమలయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Posted

in

by

Tags: