“నెలలో మూడు రోజులు మహిళ అంటరానిదా?”: శబరిమల కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ నాగరత్న సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ధార్మిక క్షేత్రాల్లో మహిళల పట్ల చూపుతున్న వివక్షపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెలలో మూడు రోజుల పాటు ఒక మహిళను ‘అంటరానిది’గా పరిగణించి, నాలుగో రోజున ఆ ముద్రను తొలగించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న స్పష్టం చేశారు. కేరళలోని శబరిమల ఆలయ ప్రవేశంతో పాటు వివిధ మతాల్లో మహిళల పట్ల అనుసరిస్తున్న ఆంక్షలపై తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఈ బెంచ్‌లో జస్టిస్ నాగరత్న ఏకైక మహిళా న్యాయమూర్తి. రుతుస్రావం ఆధారంగా మహిళలపై విధిస్తున్న ఆంక్షలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

జస్టిస్ నాగరత్న ఏమన్నారంటే?

విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. “శబరిమల నేపథ్యంలో ఆర్టికల్ 17 (అంటరానితన నిరోధక చట్టం) గురించి ఎలా వాదించగలరో నాకు అర్థం కావడం లేదు. ఒక మహిళగా చెబుతున్నాను.. ప్రతి నెలలో మూడు రోజుల పాటు అంటరానితనం ఉండి, నాలుగో రోజున అది మాయమైపోవడం అనేది ఉండదు” అని పేర్కొన్నారు. అయితే, చారిత్రక నేపథ్యం ఉన్న అంటరానితనం వేరని, ఈ కేసులో ఆర్టికల్ 17 వర్తింపుపై ఆమె తన సందేహాలను కూడా వ్యక్తపరిచారు.

కేంద్రం అభ్యంతరం.. తుషార్ మెహతా వాదన:

మరోవైపు, 2018 నాటి శబరిమల తీర్పులోని కొన్ని అంశాలపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బలమైన అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని ‘అంటరానితనం’గా (ఆర్టికల్ 17 ఉల్లంఘనగా) పరిగణించడాన్ని ఆయన తప్పుబట్టారు.
  • “భారతదేశం పశ్చాత్త దేశాలు భావించినట్లుగా పితృస్వామ్య దేశం కాదు. శబరిమలలో ఆంక్షలు కేవలం వయస్సు ఆధారంగానే ఉన్నాయి తప్ప రుతుస్రావం ఆధారంగా కాదు” అని ఆయన వాదించారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప దేవాలయాల్లో మహిళలకు అనుమతి ఉందని, కేవలం ఈ ఒక్క క్షేత్రంలోనే ప్రత్యేక నిబంధన ఉందని (Sui generis) ఆయన గుర్తుచేశారు.

Posted

in

by

Tags: