అలప్పుజ: అర్ధరాత్రి వేళ నిర్జన ప్రదేశంలో బస్సు దిగిన ఒక యువతికి, ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు కేరళ ఆర్టీసీ (KSRTC) బస్సు సిబ్బంది, ప్రయాణికులు కాపలాగా నిలిచిన ఘటన కేరళలో వెలుగుచూసింది. ప్రభుత్వ బస్సు అంటే కేవలం వాహనం మాత్రమే కాదు, అది ప్రయాణికుల భద్రతకు ఒక భరోసా అని ఈ ఘటన నిరూపించింది.
అసలేం జరిగింది?
కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న KSRTC సూపర్‌ఫాస్ట్ బస్సు (RPK 933) గత రాత్రి 12 గంటల సమయంలో అలప్పుజ జిల్లా ఎస్.ఎల్.పురం దాటిన తర్వాత ఒక నిర్జన ప్రాంతంలో ఆగింది. అక్కడ ఒక యువతి బస్సు దిగింది. అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడం, ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉండటాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కుమార్, కండక్టర్ సునీల్ ఆమెను పిలిచి ఒక ప్రశ్న వేశారు.
“నిన్ను తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరైనా వచ్చారా?” అని డ్రైవర్ అడిగారు. దానికి ఆ అమ్మాయి “లేదు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను” అని సమాధానమిచ్చింది. చుట్టుపక్కల భయంకరమైన నిశ్శబ్దం, పైగా అర్ధరాత్రి సమయం కావడంతో.. ఆ అమ్మాయిని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్లడం క్షేమం కాదని సిబ్బంది భావించారు.
నమ్మశక్యం కాని నిర్ణయం:
సాధారణంగా బస్సులు ఆలస్యమవుతున్నాయని ప్రయాణికులు గొడవ చేస్తుంటారు. కానీ, ఇక్కడ డ్రైవర్ బస్సు ఇంజిన్ ఆఫ్ చేసి, “నీకోసం ఇంటి నుండి ఎవరైనా వచ్చేవరకు మేము ఇక్కడే ఉంటాము” అని స్పష్టం చేశారు. ఆశ్చర్యకరంగా, బస్సులో ఉన్న ప్రయాణికులలో ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అందరూ ఆ అమ్మాయి భద్రత కోసం నిరీక్షించడానికి సిద్ధపడ్డారు.
కాసేపటికి ఆమె ఇంటి నుండి వాహనం వస్తున్నట్లు వెలుతురు కనిపించింది. వారు వచ్చినట్లు ధృవీకరించుకున్న తర్వాతే డ్రైవర్ బస్సును ముందుకు తీశారు.
సోషల్ మీడియాలో వైరల్:
ఈ బస్సులో ప్రయాణించిన జర్నలిస్ట్ జుబిన్ జాకబ్ ఈ మొత్తం ఘటనను ఫేస్బుక్లో పంచుకున్నారు. కేరళలో ‘ఆనవండి’గా (ఏనుగు వాహనం) పిలువబడే KSRTC బస్సు, ఆ క్షణంలో ఒక తల్లిలా ఆ అమ్మాయిని కాపాడి ‘అమ్మవండి’గా మారిందని ఆయన కొనియాడారు. “మనం రాజకీయాల కోసం గొడవ పడవచ్చు, కానీ తోటి మనిషికి ఆపద వస్తే ప్రాణమిచ్చే గుణం మనకుంది” అని ఆయన తన పోస్ట్‌లో రాశారు.
