ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్‌లో మహిళా ఉద్యోగి ఒకరు కస్టమర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఆస్థా సింగ్‌గా గుర్తించబడిన సదరు ఉద్యోగిని, కస్టమర్‌పై బూతులతో విరుచుకుపడటం కనిపించింది. వృత్తిపరమైన బాధ్యత మరచి, కుల అహంకారంతో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.
వీడియోలో ఏముంది? ఈ సంఘటన నగరంలొని పంకీ ప్రాంతంలో జరిగింది. వీడియో క్లిప్‌లో ఆస్థా సింగ్ సదరు కస్టమర్పైకి ల్యాప్‌టాప్‌ను విసురుతున్నట్లుగా బెదిరిస్తూ.. “నేను ఠాకూర్‌ని, నాతో పెట్టుకోకు” (Thakur hoon main, bakchodi mat karna mere se) అని వ్యాఖ్యానించారు. ఒక ప్రొఫెషనల్ సంస్థలో పనిచేస్తూ కులం పేరుతో అహంకారాన్ని ప్రదర్శించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
వృత్తిపరమైన నైతికతను మరియు కస్టమర్ హక్కులను ఆమె కాలరాశారని, ఆమెపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్ (X) వేదికగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను ట్యాగ్ చేస్తూ “మీ కస్టమర్ కేర్ ఇలాగే ఉంటుందా?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ విషయంపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పని ప్రదేశాలలో ఉద్యోగుల శిక్షణ మరియు కస్టమర్లతో వ్యవహరించే తీరుపై ఈ సంఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
