‘నేను డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ..’; సీఎస్కేను వణికించిన తర్వాత మనసులో మాట బయటపెట్టిన వైభవ్ సూర్యవంశీ!

ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఒక ‘హిట్టింగ్ మెషీన్’గా తన గుర్తింపును చాటుకుంటున్నాడు. ఐపీఎల్ 2025లో ప్రకంపనలు సృష్టించిన ఈ యువకుడు, ఇప్పుడు 19వ సీజన్ (2026) మొదటి మ్యాచ్‌లోనే కేవలం 15 బంతుల్లో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా తనకు సంబంధం లేదన్నట్లుగా వైభవ్ చెలరేగిపోతున్నాడు. మార్చి 30 సాయంత్రం గౌహతిలోని బర్సపరా స్టేడియంలో అతను సిక్సర్ల వర్షం కురిపించాడు. 17 బంతుల్లో 52 పరుగులు చేసిన అతని ఇన్నింగ్స్ ధాటికి రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్ అనంతరం తన గేమ్ ప్లాన్ గురించి వైభవ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

బర్త్ డే సెలబ్రేషన్స్ ఎందుకు చేసుకోలేదు?: మార్చి 27న తన పుట్టినరోజు సందర్భంగా పెద్దగా వేడుకలు చేసుకోలేదని వైభవ్ నవ్వుతూ చెప్పాడు. “నిజం చెప్పాలంటే నేను ఏమీ చేయలేదు. కేక్ కటింగ్ జరగాల్సింది, కానీ నా ముఖానికి కేక్ పూస్తారేమో అన్న భయంతో నేను త్వరగా పడుకున్నాను” అని సరదాగా వ్యాఖ్యానించాడు.

వైభవ్ అసలేం అన్నాడు? తన బ్యాటింగ్ శైలి గురించి ముఖంపై ఒక ‘నాటీ స్మైల్’ (తుంటరి నవ్వు)తో స్పందిస్తూ.. “నేను డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ.. ఈరోజు మా ప్లాన్ పవర్ ప్లేలో గేమ్‌ను కంట్రోల్ చేయడం. తక్కువ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఆ సమయం చాలా ముఖ్యం. మా పవర్ ప్లే చాలా బాగా సాగింది” అని చెప్పాడు.

తొలుత వికెట్ కొంచెం జిగటగా (Sticky) ఉన్నప్పటికీ, బంతి పాతబడే కొద్దీ బ్యాట్‌పైకి బాగా వచ్చిందని వివరించాడు. “కోచింగ్ స్టాఫ్ నాపై నమ్మకం ఉంచారు, నా సహజ సిద్ధమైన ఆట ఆడమని చెప్పారు. నా ఓపెనింగ్ పార్ట్నర్ యశస్వి జైస్వాల్ ప్రతి బంతి తర్వాత నాతో మాట్లాడుతూ నన్ను గైడ్ చేశాడు” అని వైభవ్ తెలిపాడు.

చారిత్రక విజయం: రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం (మిగిలి ఉన్న బంతుల పరంగా). 47 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి, 12 ఏళ్ల క్రితం (2014లో ఆర్సీబీపై 42 బంతులు మిగిలి ఉండగా సాధించిన విజయం) నాటి రికార్డును రాజస్థాన్ బద్దలు కొట్టింది.


Posted

in

by

Tags: