పునర్జన్మ అనేది ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఒక వీడని రహస్యం. కొన్నిసార్లు చిన్న పిల్లలు తమ పూర్వజన్మ గురించి చెప్పే ఆసక్తికర విషయాలు సైన్సును సైతం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి వింత ఘటనే ఇప్పుడు రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇక్కడ కేవలం 10 ఏళ్ల బాలుడు, తాను సుమారు 400 ఏళ్ల క్రితం అంబర్ (ఆమీర్)ను పాలించిన ప్రముఖ రాజు మాన్ సింగ్ అని చెప్పుకుంటూ రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తున్నాడు.
ఎవరీ బాలుడు? నేపథ్యం ఏంటి?
టోంక్ జిల్లా జైకమాబాద్ అనే చిన్న గ్రామానికి చెందిన కన్హారామ్ బైర్వా అనే 10 ఏళ్ల బాలుడు గత మూడేళ్లుగా తన ఇంట్లో వింత కోరికలు కోరుతున్నాడు. “నేను నా ఆమీర్ కోటకి వెళ్లాలి, నేను అక్కడి రాజును” అని మొండికేస్తున్నాడు. మొదట్లో ఇది పిల్లల ఆట లేదా ఊహ అని తల్లిదండ్రులు కొట్టిపారేశారు. కానీ కాలక్రమేణా అతను చెబుతున్న చారిత్రక అంశాలు, యుద్ధ వివరాలు మరియు అతని ప్రవర్తనలో మార్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ అబ్బాయి మాటలు కేవలం కట్టుకథల్లా లేవు, చరిత్రలోని సత్యాలతో సరిపోలుతున్నాయి.
బాలుడు చేస్తున్న వాదనలు:
కన్హారామ్ మీడియా ముందు చాలా ఆత్మవిశ్వాసంతో తన పూర్వజన్మ గురించి వివరించాడు. “నా పేరు రాజా మాన్ సింగ్. నాకు ఇద్దరు ముఖ్య రాణులు, ముగ్గురు సోదరులు ఉండేవారు. అంతేకాదు, జైపూర్‌లో ఉన్న ప్రసిద్ధ ‘సవాయి మాన్ సింగ్’ ఆసుపత్రి నా పేరు మీదే ఉంది” అని చెబుతున్నాడు. 1589 నుండి 1614 వరకు పాలించిన రాజా మాన్ సింగ్, మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యంలో అత్యంత నమ్మకమైన సేనాపతి అని చరిత్ర చెబుతోంది. తాను హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్‌తో నేరుగా తలపడ్డానని ఈ బాలుడు గుర్తుచేసుకోవడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది.
శీలా దేవి రహస్యం:
బాలుడు చెబుతున్న వివరాల్లో ఆమీర్ కోటలోని ‘శీలా దేవి’ ఆలయానికి సంబంధించిన అంశాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. “నేనే బెంగాల్ నుండి శీలా దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి ఆమీర్లో ప్రతిష్టించాను. అక్కడి రహస్య గదిలో అసలు విగ్రహం ఇప్పటికీ భద్రంగా ఉంది” అని అతను ఖచ్చితంగా చెబుతున్నాడు. చరిత్ర ప్రకారం కూడా రాజా మాన్ సింగ్ బెంగాల్ రాజు కేదార్‌ను ఓడించి శీలా దేవి విగ్రహాన్ని తెచ్చారనేది వాస్తవం. విగ్రహం మెడ కొంచెం వంగి ఉండటానికి గల చారిత్రక కారణాన్ని కూడా ఈ బాలుడు వివరిస్తున్నాడు.
రాజవంశీకుడిలా జీవనం:
కన్హారామ్ ఇప్పుడు సాధారణ పిల్లవాడిలా ఉండటం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భోజనంలో నెయ్యి ఎక్కువగా లేకపోతే అతను అసలు ముట్టుకోడు. “నేను రాజును, మీరు సామాన్యులు” అంటూ ఇంట్లో వారితో కలిసి భోజనం చేయడం కూడా మానేశాడు. అతని మాట తీరులో, నడకలో క్షత్రియ రాజుల గర్వం, శౌర్యం కనిపిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
