ఉత్తర కన్నడ జిల్లా శిరసిలో పెళ్లి సంబరాల మధ్య ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. మరణించిన తన భార్య చెల్లెలిని పునర్వివాహం చేసుకోవడానికి సిద్ధమైన ఒక వైద్యుడిని దుండగులు ఆయన నివాసంలోనే అత్యంత దారుణంగా హత్య చేశారు.
శిరసి నగరంలోని కేహెచ్‌బీ (KHB) కాలనీలో ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హత్యకు గురైన వైద్యుడిని 51 ఏళ్ల రమేష్ కలగుటకర్ గా గుర్తించారు. రమేష్ భార్య ఎనిమిది నెలల క్రితమే మరణించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, వారిలో ఒకరు వైద్యుడిగా పనిచేస్తుండగా, మరొకరు ఇంజనీరింగ్ చదువుతున్నారు.
భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉన్న రమేష్, తన పిల్లల అంగీకారంతో మరణించిన తన భార్య సోదరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విశేషమేమిటంటే, ఈరోజు అంటే ఏప్రిల్ 20, సోమవారం నాడే వారి వివాహం జరగాల్సి ఉంది.
పెళ్లి కోసం రమేష్ బ్యాంకు నుండి బంగారు ఆభరణాలను తెచ్చి ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగానే గుర్తుతెలియని వ్యక్తులు వైద్యుడిపై దాడి చేసి హత్య చేశారు. ఇంట్లోని నగల కోసం ఈ హత్య జరిగిందా లేదా ఈ వివాహం ఇష్టం లేని వారు ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి సందడి ఉండాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు కుమారుల రోదనలు మిన్నంటాయి.
ఘటనా స్థలాన్ని శిరసి సిపిఐ శశికాంత్ వర్మ సందర్శించి పరిశీలించారు. శిరసి మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హంతకుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పెళ్లి ముహూర్తానికి కొన్ని గంటల ముందే వరుడు హత్యకు గురవ్వడం శిరసి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
