నేలపై అదిమిపట్టారు: వైట్ హౌస్ ప్రెస్ డిన్నర్ షూటర్ ఫోటోను విడుదల చేసిన ట్రంప్

వాషింగ్టన్: శనివారం రాత్రి వాషింగ్టన్‌లో జరిగిన మీడియా వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగాయి. వందలాది మంది అతిథులు సమావేశమైన హోటల్ బాల్‌రూమ్ వెలుపల ఉన్న స్క్రీనింగ్ ఏరియా వద్దే గన్ మెన్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

కాల్పుల శబ్దంతో భద్రతా బృందాలు ట్రంప్‌ను వేదికపై నుండి సురక్షితంగా తరలించాయి. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో అతిథులు టేబుళ్ల కింద దూరి ప్రాణాలు కాపాడుకున్నారు.

నిందితుడి మొదటి చిత్రం విడుదల: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పులకు పాల్పడిన నిందితుడి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని కిందకు అదిమిపట్టడం ఆ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’లో నిందితుడి ఫోటోలను షేర్ చేశారు. అందులో నిందితుడు చొక్కా లేకుండా, చేతులు వెనుకకు కట్టేసి నేలపై పడి ఉన్నాడు.

నిందితుడిని కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్‌గా గుర్తించినట్లు సమాచారం. భద్రతా తనిఖీ కేంద్రం గుండా నిందితుడు పరిగెత్తుతున్న వీడియోను కూడా ట్రంప్ పోస్ట్ చేశారు.

సిబ్బంది ధైర్యాన్ని మెచ్చుకున్న ట్రంప్: రిపోర్టర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. నిందితుడి వద్ద అనేక మారణాయుధాలు ఉన్నాయని, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయి, కానీ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

“అనేక ఆయుధాలతో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పై దాడి చేసిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అడ్డుకున్నారు. ఒక అధికారికి గాయమైనా, జాకెట్ అతడిని రక్షించింది. నేను ఆ అధికారితో మాట్లాడాను, ఆయన క్షేమంగా ఉన్నారు” అని ట్రంప్ చెప్పారు. నిందితుడిపై తుపాకుల అక్రమ రవాణా సహా పలు సెక్షన్ల కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

నిందితుడు ‘మానసిక రోగి’: నిందితుడిని “అనారోగ్యంతో ఉన్న వ్యక్తి” (Sick person) గా ట్రంప్ అభివర్ణించారు. “అతడిని బంధించారు, పోలీసులు అతడి అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, రాబోయే 30 రోజుల్లో మేము ఇలాంటి వేడుకను మళ్లీ నిర్వహిస్తాం. అది మరింత పెద్దదిగా, మెరుగ్గా ఉంటుంది” అని అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.

వైట్ హౌస్ డిన్నర్ వద్ద హై అలర్ట్: సీక్రెట్ సర్వీస్ నిందితుడి అరెస్టును ధృవీకరించింది. కాల్పుల సమయంలో తుపాకులు చేతబట్టిన టాక్టికల్ బృందాలు వేదికను చుట్టుముట్టాయి. హిల్టన్ హోటల్ చుట్టూ పోలీసులు మోహరించారు, హెలికాప్టర్లు గాలిలో చక్కర్లు కొట్టాయి. దాదాపు ఐదు నుండి ఎనిమిది రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విలేకరులు, సెలబ్రిటీలు మరియు జాతీయ నాయకులతో కిక్కిరిసిన హాల్‌ను వెంటనే ఖాళీ చేయించారు. నేషనల్ గార్డ్ బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

అధ్యక్షుడిగా శనివారం జరిగిన వార్షిక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌లో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి పాల్గొనడం విశేషం. మీడియాకు మరియు ట్రంప్ యంత్రాంగానికి మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల మధ్య ఈ విందు కార్యక్రమం వార్తల్లో నిలిచింది.


Posted

in

by

Tags: