నైజీరియాలోని డెల్టా స్టేట్‌లో జరిగిన ఒక సంతానోత్పత్తి పండుగ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 2026 మార్చిలో ఓరాముడు కమ్యూనిటీ జరుపుకున్న ‘అలుయే-డో’ (Alue-Do) పండుగలో మహిళలను వీధుల్లో వెంబడించి, దిగంబరంగా చేసి, గుంపులుగా లైంగిక దాడికి పాల్పడినట్లు దిగ్భ్రాంతికర నివేదికలు వెలువడ్డాయి.
ఈ భయంకరమైన సంఘటనలను ప్రపంచవ్యాప్తంగా “రేప్ ఫెస్టివల్” (అత్యాచారాల పండుగ)గా అభివర్ణిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని, నైజీరియాలో మహిళలకు రక్షణ పెంచాలని అంతర్జాతీయంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
పండుగలో అసలేం జరిగింది?
సాంప్రదాయకంగా సంతానోత్పత్తికి సంబంధించిన ఈ అలుయే-డో పండుగ అత్యంత వికృతంగా మారింది. పురుషులు గుంపులుగా చేరి బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వెంబడించారు. బాధితుల బట్టలు చింపివేసి, అందరూ చూస్తుండగానే వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న జనం ఈ దాడులను ఆపకపోగా, కొందరు కేకలు వేస్తూ ప్రోత్సహించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ అఘాయిత్యాల్లో చిన్నపిల్లలు కూడా పాల్గొనడం గమనార్హం. బాధితుల్లో ఎక్కువ మంది సమీపంలోని విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినులే ఉన్నారని, పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
బాధితురాలి ఆవేదన
రోజ్మేరీ అనే విద్యార్థిని తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకుంది. తను బైక్‌పై ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే.. అక్కడ ఉన్న గుంపు “ఆమెను పట్టుకోండి, అది ఒక ఆడది” అని అరుస్తూ తనపై తేనెటీగల్లా పడ్డారని తెలిపింది. “వారు నా బట్టలు లాగి నన్ను దిగంబరంగా చేశారు. నా వక్షోజాలను లాగుతూ, శరీరం అంతా తాకుతుంటే నేను సహాయం కోసం కేకలు వేశాను,” అని ఆమె న్యూయార్క్ పోస్ట్‌తో వాపోయింది. ఒక బాటసారి రక్షించడంతో ఆమె అక్కడి నుండి తప్పించుకోగలిగింది.
నిపుణుల హెచ్చరిక
మహిళా హక్కుల కార్యకర్త రీటా ఐకి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “మనుషులు బహిరంగంగా ఇలాంటి పనులకు పాల్పడుతుంటే, ఇతరులు దానిని ఒక వినోదంలా చూస్తున్నారంటే.. ఆ సమాజంలో హింస ఏ స్థాయిలో సాధారణీకరించబడిందో అర్థం చేసుకోవచ్చు,” అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసుల చర్యలు
డెల్టా స్టేట్ పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ ఒక స్థానిక నాయకుడితో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు ధ్రువీకరించారు. నిందితులందరినీ వెంటనే స్టేట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)కి తరలించాలని పోలీస్ కమిషనర్ ఐనా అడెసోలా ఆదేశించారు. దోషులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీస్ ప్రతినిధి బ్రైట్ ఎడాఫ్ స్పష్టం చేశారు.
