హుబ్బళ్లి: సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ఒక ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన గురువే.. కామ వాంఛతో కళ్లు మూసుకుపోయి కట్టుకున్న భార్యకే ద్రోహం చేశాడు. పరస్త్రీ వ్యామోహంతో భార్యకు బలవంతంగా నిద్రమాత్రలు మింగించి, తన కామక్రీడలకు అడ్డులేకుండా చేసుకున్న ఈ ‘పోకిరీ’ మాస్టారి నిర్వాకం ఇప్పుడు హుబ్బళ్లిలో కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
విజయపురానికి చెందిన మాలింగప్ప ర్యాగి హుబ్బళ్లిలోని ఎల్.టి తాండా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2016లో కాంచన అనే మహిళతో ఇతనికి వివాహమైంది. వీరికి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ మాస్టారు.. తన ఎదురింట్లో ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త అప్పులు తీర్చడం కోసం బెంగళూరులో పని చేస్తుండటంతో, ఇదే అదనుగా భావించిన ఈ మాస్టారు ఆ మహిళతో ‘లవ్వి-డవ్వి’ మొదలుపెట్టాడు.
భార్యకు నరకం.. బలవంతంగా నిద్రమాత్రలు!
తన అక్రమ సంబంధానికి భార్య అడ్డుకాకూడదని మాలింగప్ప అత్యంత అమానవీయంగా ప్రవర్తించేవాడు. రాత్రి వేళల్లో భార్యను కొట్టి, హింసించి ఆమె నోట్లో బలవంతంగా నిద్రమాత్రలు కుక్కేవాడు. ఆమె గాఢ నిద్రలోకి జారుకున్నాక, ఎదురింటి మహిళను తన ఇంటికే పిలిపించుకుని రాసలీలలు సాగించేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది.
సెల్‌ఫోన్ చూసి షాక్.. ఆత్మహత్యాయత్నం!
భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన కాంచన, ఒకరోజు అతని మొబైల్ ఫోన్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. ఎదురింటి మహిళతో జరిపిన అసభ్యకర చాటింగ్, వీడియోలు చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. దీనిపై భర్తను నిలదీయగా.. మాలింగప్ప ఆమెను చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. మనస్తాపానికి గురైన కాంచన ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి బుద్ధి చెప్పినా, ఈ మాస్టారు తన పద్ధతి మార్చుకోకపోగా.. భార్యను పుట్టింటికి పంపించి వేశాడు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితురాలు
తల్లిదండ్రుల వద్ద ఉంటున్న కాంచన, చివరకు హుబ్బళ్లి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు కౌన్సెలింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, తనకు న్యాయం జరగడం లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.
“పిల్లలకు దారి చూపాల్సిన ఉపాధ్యాయుడే ఇలాంటి పాడుపనులకు పాల్పడటం సిగ్గుచేటు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని స్థానిక మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాళి కట్టిన భార్యకు నిద్రమాత్రలు ఇచ్చి, పక్కదారి పట్టిన ఈ ‘పాడు’ మాస్టారి ఉదంతం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
