“పండుగకు బహుమతి కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి” అని ఆశగా అడిగిన భార్య. పని కోసం ఏ ఊరికి వెళ్లాలన్న దానిపై వివాదం. ముగ్గురు పసిపిల్లల ముందే భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భర్త.. తీవ్ర కలకలం.!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం షాజహాన్‌పూర్‌లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో, భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

షాజహాన్‌పూర్ జిల్లా అల్లాగంజ్ ప్రాంతానికి చెందిన అవనీష్ (35) – సుశీల (30) దంపతులకు వివాహమై 8 ఏళ్లు అవుతుండగా, వారికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. భర్త అవనీష్ పని కోసం పంజాబ్‌లోని లూథియానా వెళ్లాలనుకోగా, భార్య సుశీల మాత్రం ఢిల్లీకి వెళ్లాలని పట్టుబట్టింది. దీంతో బుధవారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా, రానున్న కర్వా చౌత్ పండుగ సందర్భంగా బహుమతులు కొనుక్కోవడానికి ఆమె తన భర్తను డబ్బులు కూడా అడిగింది.

మాటల మాటల పెరిగి వాగ్వాదం ముదరడంతో, ఆగ్రహానికి గురైన అవనీష్ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని తన ముగ్గురు పసిపిల్లల కళ్లెదుటే భార్య మెడ, ఛాతీ భాగాలపై విచక్షణారహితంగా నరికాడు. ఈ దాడిలో సుశీల రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన అనంతరం అవనీష్ తన ఆరేళ్ల పెద్ద కుమారుడిని మాత్రమే తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి మిగతా ఇద్దరు పసిపిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు, ఆ పిల్లలను చేరదీసి సంరక్షించారు.

హత్యకు గురైన సుశీల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అవనీష్ తరచూ సుశీలను కొట్టి హింసించేవాడని, దీంతో ఆమె రెండు నెలల పాటు పుట్టింట్లోనే ఉందని చెప్పారు. 15 రోజుల క్రితమే బంధువులు పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరికీ సర్దిచెప్పి సుశీలను భర్త ఇంటికి పంపించారు. “నన్ను మళ్లీ అతని దగ్గరికి పంపితే నన్ను చంపేస్తాడు” అని సుశీల అప్పటికే భయపడినట్లుగానే ఈ దారుణం జరగడం అందరినీ కలచివేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న భర్త అవనీష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పని కోసం వెళ్లే ప్రదేశానికి సంబంధించిన వివాదంలో, ముగ్గురు పసిపిల్లల కళ్లెదుటే కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని రేపింది.


Posted

in

by

Tags: