న్యూఢిల్లీ: ఆగ్నేయ (సౌత్-ఈస్ట్) ఢిల్లీలోని ప్రతిష్టాత్మక కైలాష్ హిల్స్ ప్రాంతంలో ఒక సంచలనాత్మక హత్య ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘోర ఘటనలో ఒక డాక్టర్ తన ఇంట్లో పనిచేసే మహిళను క్రికెట్ బ్యాట్‌తో విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
అంతటితో ఆగకుండా, ఆ తర్వాత కత్తితో దాడి చేసి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన తర్వాత నిందితుడైన డాక్టర్ అక్కడి నుండి పారిపోకుండా, శవం పక్కనే అలాగే కూర్చుండిపోయాడు. ఢిల్లీ పోలీసులు నిందితుడైన డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. అసలు ఏ కారణాల వల్ల ఈ హత్య జరిగిందనే కోణాన్ని తెలుసుకోవడానికి నిందితుడిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. నిందితుడైన డాక్టర్ ఇంటి పక్కన నివసించే ఒక వ్యక్తి.. ఒక మహిళ రక్తపు మడుగులో పడి ఉందనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ సుమారు 45 ఏళ్ల మహిళ రక్తసిక్తమైన స్థితిలో నేలపై పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ మహిళ శవం పక్కనే ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఆగ్నేయ జిల్లా డిసిపి (DCP) హేమంత్ తివారీ మాట్లాడుతూ.. మృతురాలిని 45 ఏళ్ల మీనాగా గుర్తించినట్లు తెలిపారు. అలాగే నిందితుడిని 50 ఏళ్ల డాక్టర్ మనీష్ గుప్తాగా గుర్తించారు. ఆయన వృత్తిరీత్యా చర్మవ్యాధి నిపుణుడు (డెర్మటాలజిస్ట్). ప్రాథమిక విచారణలో నిందితుడు మీనాపై దాడి చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు మొదట మహిళపై బ్యాట్‌తో దాడి చేశాడని, ఆ తర్వాత కత్తితో పొడిచి హత్య చేశాడని డీసీపీ పేర్కొన్నారు. పోలీసులు నిందితుడిని వెంటనే రిమాండ్‌లోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
హత్యకు ఉపయోగించిన బ్యాట్ మరియు కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించేందుకు పోలీసు క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. విచారణ మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు గల అసలు కారణాలు వెల్లడవుతాయని ఆయన స్పష్టం చేశారు.
