“పరికడుపున నెయ్యి తాగితే శరీరం శుభ్రపడుతుందా..?” సోషల్ మీడియా ట్రెండ్‌లో దాగి ఉన్న ముప్పు.. నిజాలు బయటపెట్టిన నిపుణులు..!!!

సోషల్ మీడియాలో “పరికడుపున నెయ్యి తాగితే శరీర బరువు తగ్గుతుంది, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి” అని ప్రచారమవుతున్న వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.

అయితే, సోషల్ మీడియాలో చూసేదాన్ని ఉన్నది ఉన్నట్లుగా గుడ్డిగా అనుసరించడం ప్రమాదకరమని, ఇది అందరికీ సెట్ కాదని వైద్య, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆయుర్వేదంలో “స్నేహపానం” అనే చికిత్సా విధానంలో నెయ్యిని ఉపయోగించినప్పటికీ, అది వైద్యుని ప్రత్యక్ష పర్యవేక్షణలో మాత్రమే చేసే చికిత్స. అలా కాకుండా, సోషల్ మీడియాలో చెబుతున్నట్లు ప్రతిరోజూ 100 నుండి 150 మిల్లీలీటర్ల నెయ్యిని పరికడుపున తాగడం జీర్ణవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నెయ్యిలో మంచి కొవ్వులు, విటమిన్లు ఉన్నప్పటికీ, దానిని “విష పదార్థాలను బయటకు పంపే అద్భుత ఔషధం” అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవు.

ముఖ్యంగా, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలే శరీరంలోని వ్యర్థాలను సహజంగా బయటకు పంపుతాయి. కాబట్టి, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, కొవ్వు కాలేయం (ఫ్యాటీ లివర్), పిత్తాశయంలో రాళ్లు మరియు ఎసిడిటీ సమస్య ఉన్నవారు వైద్యుని సలహా లేకుండా పరికడుపున నెయ్యి తాగకూడదు. పరిమితికి మించి నెయ్యి తాగినప్పుడు వికారం, విరేచనాలు, అజీర్తి మరియు రక్తంలో కొవ్వు పెరగడం వంటి దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది.

మంచి కొవ్వును పొందడానికి నెయ్యి ఒక మంచి ఆహారమే; కానీ దానికి పరికడుపున తాగాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ తినే ఆహారంలోనే పరిమితంగా చేర్చుకోవడమే సురక్షితమైన మార్గం. కాబట్టి, సోషల్ మీడియా ట్రెండ్‌లను చూసి మోసపోకుండా, మీ శరీర అవసరాన్ని తెలుసుకుని, వైద్యుని సలహాతో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడమే శ్రేయస్కరం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *