చైనా రాజధాని బీజింగ్‌లో ఇటీవల జరిగిన ‘హైరాక్స్’ (Hyrox) ఫిట్‌నెస్ పోటీల్లో తీవ్రమైన ఆరోగ్య, పరిశుభ్రత వివాదం చెలరేగింది.
ఈ పోటీలో పాల్గొన్న ఆస్ట్రేలియాకు చెందిన జోవానా వియెట్ర్సి అనే మహిళా అథ్లెట్, పరుగు పందెం మధ్యలో హఠాత్తుగా అనారోగ్య సమస్య (జీర్ణక్రియ సమస్య) తలెత్తడంతో మల విసర్జన చేసి తన దుస్తులను మురికి చేసుకుంది.
అయినప్పటికీ, పందెయాన్ని మధ్యలోనే ఆపకుండా ఆమె నిరంతరం పరిగెత్తి విజయాన్ని నమోదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలలో ఆమె కాళ్లు, బూట్లు అశుభ్రంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆమె అదే స్థితిలోనే మ్యాట్‌లు, వర్కౌట్ పరికరాలను ఉపయోగిస్తూ పోటీని పూర్తి చేసింది. అయితే, ఆ తర్వాత అవే పరికరాలను, రన్నింగ్ ట్రాక్‌ను ఉపయోగించిన ఇతర పోటీదారులు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదంలో పడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా, చైనాకు చెందిన ‘Weibo’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో, ‘ఇతర అథ్లెట్ల ఆరోగ్యం గురించి నిర్వహణ వర్గం ఎందుకు ఆలోచించలేదు?’, ‘విదేశీ అథ్లెట్‌కు అనుకూలంగా వ్యవహరించారు’ అని చాలామంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారడంతో, హైరాక్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు మోరిట్జ్ ఫర్స్ట్ సోమవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పరిస్థితి తీవ్రతను తక్షణమే గుర్తించి స్పందించడంలో విఫలమయ్యామని తెలిపిన ఆయన, ‘ఇలాంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు, మార్గదర్శకాలను అమలు చేశాం’ అని వెల్లడించారు. అంతేకాకుండా, చైనా ప్రభుత్వ మీడియా కూడా ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం.

Leave a Reply