పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారతీయ బాలీవుడ్ పాటకు ఒక పాఠశాల విద్యార్థి పాక్ జెండాతో డ్యాన్స్ చేసిన విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ ఉమర్కోట్ నగరంలో ఉన్న ‘ది స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఒక విద్యార్థి చేతిలో పాకిస్తాన్ జాతీయ జెండాను పట్టుకుని, బాలీవుడ్ హిట్ మూవీ ‘కేసరి’లోని ప్రసిద్ధ దేశభక్తి గీతమైన “తేరీ మిట్టీ మే మిల్ జావా” పాటకు ఎంతో ఉద్వేగంగా డ్యాన్స్ చేశాడు.
ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బయటకు రావడంతో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. “సొంత దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా పాకిస్తాన్కు భారతీయ పాటలే దిక్కయ్యాయా?” అంటూ భారతీయ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో, దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా ఆ పసివాడు వేసిన అద్భుతమైన స్టెప్పులను, నటనను పలువురు ప్రశంసిస్తున్నారు.
